బీసీలకు మళ్ళీ తప్పుడు హామీలేనా?

వ‌చ్చే ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీ కులాలకు టికెట్లు కేటాయిస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు మళ్ళీ స్వర్ణయుగమే అని అన్నారు. పార్టీకి 40 ఏళ్ళుగా బీసీలు బలమైన మద్దతుదారులుగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.

Advertisement
Update:2023-04-28 10:46 IST

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బీసీల కలవరింత బాగా ఎక్కువైపోయింది. దూరమైపోయిన బీసీ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకుంటే కానీ గెలుపు సాధ్యంకాదని అర్థ‌మైపోయింది. అందుకనే పదేపదే బీసీల కోసం కలవరిస్తున్నారు. తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం పర్యటనలో ఈ విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే తన సహజ ధోరణిలో మళ్ళీ తప్పుడు హామీలిచ్చారు. ఈ సారి తనకు అధికారం అప్పగిస్తే బీసీల రుణం తీర్చుకుంటారట.

వచ్చే ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీ కులాలకు టికెట్లు కేటాయిస్తారట. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు మళ్ళీ స్వర్ణయుగమే అన్నారు. పార్టీకి 40 ఏళ్ళుగా బీసీలు బలమైన మద్దతుదారులుగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీసీలు టీడీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్నది వాస్తవమే. అయితే అదంతా ఎన్‌టీఆర్‌ పుణ్యమే కానీ ఇందులో చంద్రబాబు చేసిందేమీ లేదు. పార్టీ, సీఎం కుర్చీ చంద్రబాబు చేతికి వచ్చిన తర్వాత బీసీలకు చంద్రబాబు కొత్తగా చేసిందేమీలేదు.

బీసీలకు ఏమీ చేయకపోగా దూరంచేసుకున్నారు. 2014లో సీఎం అయిన తర్వాత బీసీ సంఘాల నేతలతో గొడవలు పడి నోటికొచ్చింది మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాళ్ళని తోకలు కత్తిరిస్తానని.. అందరిముందు అవమానంగా మాట్లాడారు. దాంతో బీసీల్లో చీలిక వచ్చి 2019 ఎన్నికల్లో చంద్రబాబు తోకనే కత్తిరించేశారు. ఈమధ్యనే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీకి బీసీలు దూరమవ్వటం వల్లే ఓడిపోయామని అంగీకరించారు.

ఇదే సమయంలో గతంలో ఎప్పుడూ లేనంతగా జగన్మోహన్ రెడ్డి బీసీలను నెత్తిన పెట్టుకుంటున్నారు. పదవుల్లో మెజారిటి బీసీలకే కేటాయిస్తున్నారు. బీసీలు జగన్ - చంద్రబాబు మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నారు. అవస‌రం కోసం దగ్గరకు తీసుకుని, నోటికొచ్చిన హామీలిచ్చేసి తర్వాత దూరంగా తరిమేయటం చంద్రబాబు నైజం. లేకపోతే రాబోయే ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లివ్వటం ఎలా సాధ్యం? అయినా ఇచ్చేస్తానని హామీ ఇచ్చేశారు. చంద్రబాబు హామీలను నమ్మేసి దూరమైన బీసీలు జగన్‌ను వదిలేసి మళ్ళీ చంద్రబాబు దగ్గరకు వెళతారా?

Tags:    
Advertisement

Similar News