ఈనెల 31న చంద్రబాబు, పవన్ భేటీ..
కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి లభించే స్థానం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కూటమి ఓడిపోతే పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు విదేశాలనుంచి తిరిగొచ్చారు. రేపు ఆయన అమరావతికి వస్తారని అంటున్నారు. అటు కౌంటింగ్ రోజుకి పవన్ కల్యాణ్ కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ కి చేరుకుంటారని తెలుస్తోంది. ఈలోగా మే-31న ఇరువురు నాయకులు విజయవాడలో కలుస్తారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల తర్వాత వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల రోజు ఎవరికి వారు తమ ఓటు హక్కు వినియోగించుకుని, ఆ తర్వాత ప్రధాని మోదీ నామినేషన్ ర్యాలీలో పాల్గొనడానికి కాశీ వెళ్లారు చంద్రబాబు, పవన్. కలసి మాత్రం ఎక్కడా కనపడలేదు, కలసి ఎలాంటి స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఫలితాలపై ధీమా వ్యక్తం చేశారు కానీ.. వైసీపీ లాగా సీట్ల లెక్కలు వారు చెప్పలేకపోయారు. ఇక ప్రభుత్వం ఏర్పాటుపై ధీమాగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వారి పోస్టింగ్ లను బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కూడా చంద్రబాబు, పవన్.. సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టారు. ఆ తర్వాత ఇద్దరూ ఇప్పుడు తొలిసారి భేటీ కాబోతున్నారు.
కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి లభించే స్థానం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కూటమి ఓడిపోతే పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏది జరిగినా.. చంద్రబాబు సూచనలతోనే పవన్ కల్యాణ్ ప్రయాణం ఉంటుందనేది మాత్రం తేలిపోయింది. ఇక మే-31న భేటీ తర్వాత చంద్రబాబు, పవన్.. మీడియా ముందుకొస్తారా..? లేక ఫలితాలు విడుదలయ్యే వరకు వేచి చూస్తారా..? అనేది తేలాల్సి ఉంది.