టీడీపీలో 'ఇదేం కర్మ'

చంద్రబాబు రూపొందించిన ‘ఇదేం కర్మ’ కార్యక్రమం 45 రోజులు జరగాలి. అంటే నేతలు, కార్యకర్తలంతా 45 రోజుల పాటు జనాల్లోనే ఉండాలంటే చేయాల్సిన ఖర్చుల విషయంలోనే తమ్ముళ్ళు భయపడుతున్నారు.

Advertisement
Update:2022-11-19 11:12 IST

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు కొత్త ప్రోగ్రామ్‌ను రెడీ చేశారు. ఇప్పటి వరకు బాదుడే బాదుడు కార్యక్రమం అయిపోగానే వెంటనే 'ఇదేం కర్మ' అనే కార్యక్రమంతో తమ్ముళ్ళంతా జనాల్లోకి వెళ్ళాలట. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను జనాలకు వివరించటానికే తమ్ముళ్ళంతా జనాల దగ్గరకు వెళ్ళాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే ఈ కొత్త కార్యక్రమాన్నిరూపొందించారు. ఈ కార్యక్రమంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వం పెంచేస్తున్న చార్జీలు, రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోవటం లాంటి అనేక అంశాలను తమ్ముళ్ళు జనాలకు వివరించాలి.

తమ్ముళ్ళలో కొత్త కార్యక్రమంపై నిరాసక్తత పెరిగిపోవటం ఖాయం. ఎందుకంటే బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకే చాలా మంది నేతలు ఇష్ట పడలేదు. తాను పిలుపిచ్చినా తమ్ముళ్ళు చాలా మంది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని స్వయంగా చంద్రబాబే చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమమే పూర్తిగా సక్సెస్ కాలేదు. అలాంటిది వెంటనే ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని టేకప్ చేయాలంటే తమ్ముళ్ళకు ఇబ్బందే.

చంద్రబాబు రూపొందించిన ఈ కార్యక్రమం 45 రోజులు జరగాలి. అంటే నేతలు, కార్యకర్తలంతా 45 రోజుల పాటు జనాల్లోనే ఉండాలంటే చేయాల్సిన ఖర్చుల విషయంలోనే తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఖర్చులకు భయపడే ముఖ్యంగా తమ్ముళ్ళు నిరసన కార్యక్రమాలను టేకప్ చేయటం లేదు. ఏ కార్యక్రమాన్ని అయినా గట్టిగా చేయాలంటే ఒక్క రోజుకు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాంటిది ఏకంగా 45 రోజులు జనాల్లోనే ఉండాలంటే మామూలు విషయం కాదు.

ఒక వైపు జగన్మోహన్ రెడ్డి ప్రిస్టేజిగా తీసుకున్న గడప గడపకు మ‌న‌ ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ ఇదేం కర్మ ప్రారంభం అవుతోంది. అంటే కార్యక్రమాల పేరుతో వైసీపీ - టీడీపీ నేతలు ఎదురుపడితే గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు మళ్ళీ టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతల దౌర్జన్యమని చంద్రబాబు గోల చేయటం ఖాయం. చివరకు జరగబోయేదేమిటంటే కేసులు పడిన తర్వాత నేతలు, కార్యకర్తలు ఇదేం కర్మరా అని తలలు బాదుకోవటమే.

Tags:    
Advertisement

Similar News