రెండు చానళ్లను బహిష్కరించిన టీడీపీ అధినేత
టీవీ9, ఎన్‌టీవీలను బాయ్‌కాట్ చేయాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రెండు చానళ్లను నీలి మీడియాగా అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని విమర్శించే మీడియాను తన జీవితంలో చూడలేదని వ్యాఖ్యానించారు.
ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ పార్టీలు నేరుగా చేసుకునే ఫైట్ కంటే మీడియా ద్వారా చేస్తున్న పోరాటాలే ఆసక్తిగా ఉంటున్నాయి. మీడియా రెండుగా చీలిపోయి రాజకీయ పార్టీల పక్షాన కర్రసాము చేస్తోంది. సాక్షిని టీడీపీ విమర్శిస్తుంది. టీవీ5, ఏబీఎన్, ఈనాడుపై జగన్ విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు కాస్త మధ్యస్థంగా ఉండే చానళ్లపైనా టీడీపీ అధినేత చంద్రబాబు కన్నెర్ర చేశారు.
టీవీ9, ఎన్‌టీవీలను బాయ్‌కాట్ చేయాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ రెండు చానళ్లను నీలి మీడియాగా అభివర్ణించారు చంద్రబాబు. రాష్ట్రంలో అరాచకం నడుస్తుంటే... తిరిగి ప్రతిపక్షాన్ని విమర్శిస్తారా అని ఆ చానళ్లను ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని విమర్శించే మీడియాను తన జీవితంలో చూడలేదని ఇప్పుడు చూస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాబట్టి ఉన్మాదులకు వంతపాడుతున్న టీవీ9, ఎన్‌టీవీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ సమయంలో ఈ రెండు చానళ్లు టీడీపీకి మద్దతుగా నిలవకపోవడంతోనే ఆ పార్టీకి కోపం వచ్చినట్టు భావిస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ నుంచే ఆ చానళ్లపై నీలి మీడియా అంటూ టీడీపీ దాడి చేయడం మొదలుపెట్టింది. ఏకపక్షంగా ఉండే సాక్షి కంటే.. మధ్యస్థంగా ఉండే టీవీ9, ఎన్‌టీవీలు ప్రసారం చేసే కథనాలతోనే టీడీపీకి పెద్ద ఇబ్బంది ఉంటుందని చంద్రబాబు భావించే ముందస్తుగా వాటిని ఒక గాటిన కట్టేశారని భావిస్తున్నారు. ప్రతిపక్షాన్ని మీడియా విమర్శించడం తన జీవితంలో ఎన్నడూ చూలేదని చంద్రబాబు అంటున్నారే గానీ.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీద టీడీపీ అనుకూల మీడియా ఏ స్థాయిలో దాడి చేసిందో అందరికీ గుర్తే.