కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయకపోవచ్చు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుప్పంలో వైసీపీ మరింత బలోపేతంగా మారింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలుపొంది షాక్ ఇచ్చింది.

Advertisement
Update:2024-01-27 23:10 IST

వచ్చే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి పోటీ చేయకపోవచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 1989 నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన చంద్రమౌళిపై కేవలం 30 వేల ఓట్ల మెజారిటీతోనే చంద్రబాబు గెలుపొందారు. గతంతో పోలిస్తే చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ చాలా తక్కువ.

అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుప్పంలో వైసీపీ మరింత బలోపేతంగా మారింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలుపొంది షాక్ ఇచ్చింది. కుప్పంలో వైసీపీ బలపడిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కూడా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు.

చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తరచూ కుప్పంలో పర్యటిస్తూ వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి కుమారుడు భరత్ కు వైసీపీ ఇన్ చార్జి పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది. దీంతో ఆయన నియోజకవర్గంలో ఉత్సాహంగా తిరుగుతూ వైసీపీని పటిష్టం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు అప్పటిలా సులువుగా విజయం సాధించడం కాస్త కష్టమే. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలోనే కుప్పం అభివృద్ధి చెందిందని, ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబుకు ఏ విషయం లేదని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలిచే పరిస్థితి కూడా లేదన్నారు. అసలాయన కుప్పం నుంచి పోటీ చేయకపోవచ్చు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పోటీ చేసినా ముందు జాగ్రత్తగా మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    
Advertisement

Similar News