బూటకపు హామీలు.. బడ్జెట్ ని మించిపోయిన బాబు పథకాలు
సామాజిక పెన్షన్లకే ఏపీ బడ్జెట్ లో 35శాతం కేటాయిస్తే ఇక పాలన సాగేదెలా..? అంటే బాబు మేనిఫెస్టో ఒక బూటకం అని అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు..
చంద్రబాబు మేనిఫెస్టో హామీలు అమలు చేయాలంటే అంతకు మించి కావాలి..
అంటే చంద్రబాబు హామీలు అమలు చేయడం అసాధ్యం.
అంటే ఆ మేనిఫెస్టో ఒక బూటకం.
అమలు చేసే ఉద్దేశం ఉంటే జగన్ లాగా సాధ్యమయ్యే హామీలే మేనిఫెస్టోలో ఉంటాయి. కానీ ఆ ఉద్దేశమే లేదు కాబట్టి చంద్రబాబు కోతలు కోశారు.
- అగ్రవర్ణాలు మినహా మిగతా వర్గాల్లో 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 4వేలు పెన్షన్ ఇస్తానన్నారు.
- 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానన్నారు.
- ప్రతి రైతుకి ఏటా రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తానన్నారు.
- ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం
- ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు..
ఈ లిస్ట్ ఇంకా చాలానే ఉంది. వీటిలో ఒక్కో హామీకి లెక్కలు తీస్తే చంద్రబాబు ఎంత మోసగాడో, ఎలాంటి బూటకపు హామీలు ఇచ్చాడో అర్థమవుతుంది.
50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు పెన్షన్ అనే హామీకి లెక్కలు కడితే.. అగ్రవర్ణాలు మినహా రాష్ట్రంలో 50 ఏళ్లు దాటిన వారు, పెన్షన్ కు అర్హులైనవారు కోటిన్నర మంది ఉంటారు. వారికి రూ.4వేల చొప్పున నెలకు మొత్తం 6వేల కోట్ల రూపాయలు అవసరం. అంటే ఏడాదికి మొత్తం 72వేల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు అయితే అందులో 35 శాతం కేవలం సామాజిక పెన్షన్ కే కేటాయించాలి. ఇందులో వికలాంగులు, ఇతర వర్గాల వారు, డయాలసిస్ పేషెంట్లకు ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా కలిపితే అది మరింత పెరుగుతుంది.
18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ప్రతి నెల రూ.1500 కానుక అన్నారు. అలాంటి వారు 2 కోట్ల మంది రాష్ట్రంలో ఉన్నారు. వారికి నెలకు 3వేల కోట్ల చొప్పున ఏడాదికి 36వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇది కాకుండా నిరుద్యోగ భృతి, పెంచిన రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లలో ఇలాంటి ఉచితాలకే ముప్పాతిక శాతం ఖర్చు చేస్తే మిగతా పాతిక శాతంతో పాలన ఎలా సాగుతుంది.
ఏపీని శ్రీలంకలా చేస్తున్నారు, ఉచిత పథకాలతో నాశనం చేస్తున్నారు, ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారని గతంలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అంతకంటే రెట్టింపు పథకాలు ప్రకటించారు. అదేమని అడిగితే తాను సంపద సృష్టిస్తానంటున్నారు. ఎంత సంపద సృష్టించినా ఇన్ని పథకాలను గట్టెక్కించలేరు అనేది మాత్రం వాస్తవం. అంటే సంపద సృష్టి అనే ఒక ఊహాజనిత పదాన్ని పట్టుకుని ఓట్లు కొల్లగొట్టడానికి చంద్రబాబు చెబుతున్న కట్టుకథ.. 2024 మేనిఫెస్టో.
జనం మరీ అంత అమాయకులా..?
2014లో చంద్రబాబు రుణమాఫీ సహా ఇతర హామీలకు మోసపోయి ప్రజలు ఆయన్ను గెలిపించారు. హామీల అమలులో ఆయన ఏపాటి వీరుడో, శూరుడో అందరికీ ఆర్థమైంది. 2019లో జగన్ పై నమ్మకంతో గెలిపించారు. నవరత్నాల హామీలలో 99శాతం అమలు చేసి చూపించారు జగన్. ఈసారి కూడా వాటినే కొనసాగిస్తాను, కొన్నిచోట్ల ఆర్థిక లబ్ధి పెంచుతాను అని నమ్మకంగా చెప్పారు. చంద్రబాబు యధావిధిగా తన పాత పాట మొదలు పెట్టారు. అది చేస్తా, ఇది చేస్తానంటూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ ని కూడా మించిపోయిన చంద్రబాబు మోసాల మేనిఫెస్టోని నమ్మి ఓట్లు వేసేంత అమాయకులు కాదు ప్రజలు. బాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే అప్రమత్తంగా ఉన్నారు. కీలెరిగి వాత పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.