చంద్రబాబు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారా?

ఆశావహుల మధ్య పెరుగుతున్న పోటీ ప్రభావం జనాల హాజరు రూపంలో కనబడుతోంది. ఇదే ఉత్సాహం రేపటి ఎన్నికల్లో కూడా జనాలు చూపించినప్పుడే కదా అధికారంలోకి వచ్చే ముచ్చట తేలేది. టికెట్ ఫైనల్ చేసినప్పుడే అసలు విషయం బయటపడుతుంది.

Advertisement
Update:2022-12-03 11:42 IST

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడులో ఉత్సాహం పెరిగిపోతోంది. కర్నూలు జిల్లా పర్యటనతో మొదలైన ఈ ఉత్సాహం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఉత్సాహానికి కారణం ఏమిటంటే తన పర్యటనల్లో గతంలో ఎప్పుడూ రానంత జనాలు ఇప్పుడు వస్తున్నారని ఆయనే చెప్పుకుంటున్నారు. ప్రజల్లో కనబడుతున్న ఉత్సాహం చూస్తుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని చంద్రబాబు అనుకుంటున్నారు.

చంద్రబాబు ఊపు చూస్తుంటే ఎన్నికలు పెట్టడమే ఆలస్యం పార్టీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటానికి ముహూర్తం కూడా ఫైనల్ చేసుకునేట్లున్నారు. చంద్రబాబు పర్యటనలకు జనాలు పెద్దఎత్తున హాజరవుతున్నది నిజమే అని అనుకున్నా ఎందుకిలా వస్తున్నారు? తన మాటలతో జనాలను ఆకర్షించటానికి చంద్రబాబు ఏమీ బ్రహ్మాండమైన వక్త కాదు. అధికారంలో ఉన్నప్పుడు హామీలు నిలుపుకున్నదీ లేదు, జనరంజక పాలనను అందించిందీ లేదు.

అయినా తాజా పర్యటనల్లో జనాలు ఎందుకు హాజరవుతున్నట్లు? ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లోని నేతల శ్రమ ఫలితమే కారణం. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం నేతల మధ్య పోటీ ఉంది. టికెట్ తమకే దక్కాలంటే కాదు తామే పోటీ చేయాలనే ఆలోచనతో ఎవరికివారుగా పోటీపడి జనాలను తరలిస్తున్నారు. చివరకు టికెట్ ఎవరికి ఇస్తారనేది పక్కనపెట్టేస్తే ఇప్పటికైతే జనాలు బ్రహ్మాండంగా హాజరవుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు చేసిన పనేమిటంటే చాలా నియోజకవర్గాల్లో ఆశావహులతో మాట్లాడేట‌ప్పుడు ఎవరికి వాళ్ళకే టికెట్లపై ఆశలు కల్పిస్తున్నారట.

ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తామే అని ఎవరికి వారు అనుకుంటు చంద్రబాబు పర్యటనలకు జనాలను విపరీతంగా తీసుకొస్తున్నారు. ఆశావహుల మధ్య పెరుగుతున్న పోటీ ప్రభావం జనాల హాజరు రూపంలో కనబడుతోంది. ఇదే ఉత్సాహం రేపటి ఎన్నికల్లో కూడా జనాలు చూపించినప్పుడే కదా అధికారంలోకి వచ్చే ముచ్చట తేలేది. టికెట్ ఫైనల్ చేసినప్పుడే అసలు విషయం బయటపడుతుంది. అప్పటివరకు చంద్రబాబు పర్యటనలకు జనాలు ఇలాగే హాజరవుతారేమో.

Tags:    
Advertisement

Similar News