యనమలకు చెక్ పెడుతున్నారా?
గడచిన మూడు ఎన్నికల్లో వరసగా యనమల సోదరులు ఓడిపోతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో యనమలకు ప్రత్యామ్నాయంగా వేరే నేతను పోటీలోకి దింపేందుకు చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకి చంద్రబాబా నాయుడు చెక్ పెడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీకి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే విషయాన్ని చంద్రబాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. 1983 నుంచి ఇక్కడ యనమలే యాక్టివ్‌గా ఉన్నందుకు ఈయనకు ప్రత్యామ్నాయంగా మరో నేతే లేకుండాపోయారు. గెలిచినా ఓడినా యనమలదే ఆధిపత్యం కావడంతో ఇతర నేతలెవరూ పోటీలో కూడా లేరు.
అయితే గడచిన మూడు ఎన్నికల్లో వరసగా యనమల సోదరులు ఓడిపోతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో యనమలకు ప్రత్యామ్నాయంగా వేరే నేతను పోటీలోకి దింపేందుకు చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో సీనియర్ అయిన రాజా అశోక్ బాబుతో ఈమధ్య భేటీ అయ్యారు. అశోక్ బాబుకు నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. ఈయన కాంగ్రెస్ తరపున గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ ఇతర సామాజిక వర్గాలతో కూడా కలుపుగోలుగా ఉంటారు.
అశోక్‌ను వచ్చే ఎన్నికల్లో తుని నుంచి పోటీ చేయించాలని చంద్రబాబుకు బలంగా ఉన్నట్లుంది. అందుకనే ప్రత్యేకంగా పిలిపించుకుని భేటీ అయ్యారు. మరి చంద్రబాబు ఆలోచనలతో యనమల ఏ విధంగా స్పందిస్తారో తెలీదు. అయితే చివరిసారిగా తన సోదరుడు యనమల కృష్ణుడికే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని యనమల గట్టిగా పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి దాటిశెట్టి రాజా బలమైన అభ్యర్ధి అనటంలో సందేహం లేదు. దాటిశెట్టి నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో పాటు జనాలకు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అందుకనే దాడిశెట్టంటే జనాల్లో సానుకూల స్పందనే కనిపిస్తోంది. టీడీపీ నుండి అశోక్‌ను రంగంలోకి దింపటం ఖాయమైతే మరి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరిస్ధితి ఏమిటనేది అయోమయంగా తయారైంది.