చేరికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పాత పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసినవారికే తన పార్టీలో చోటిస్తానని చంద్రబాబు చెప్పడం విశేషం.
ఏపీలో చేరికల సీజన్ జోరందుకున్నట్టు తెలుస్తోంది. ఓటమి తర్వాత కూడా జగన్ తోనే ఉంటాం, వైసీపీలోనే కొనసాగుతామని చెప్పిన నేతల్లో చాలామంది మెల్లగా జారుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఒకరిద్దరు రాజ్యసభ సభ్యులు కూడా అదే బాటలో ఉన్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఈ దశలో చంద్రబాబు చేరికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని ఆయన చెప్పారు. రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.
2014 విజయం తర్వాత చంద్రబాబు చేరికల్ని బాగా ప్రోత్సహించారు. వైసీపీని మరింత బలహీన పరిచేందుకు ఏకంగా 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేసుకున్నారు. అప్పట్లో పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేయాలనే రూలేమీ పెట్టలేదు. అలా తీసుకున్నవారికి మంత్రి పదవులు కూడా ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. దాని ఫలితం 2019 ఎన్నికల్లో టీడీపీపై బాగానే కనపడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మాత్రం చేరికల విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించింది. పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసిన వారిని మాత్రమే వైసీపీలోకి తీసుకుంటామన్నారు జగన్. కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి కండువాలు మార్చుకుని, తిరిగి వెంటనే వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అలాంటి వారిలో పోతుల సునీత కూడా ఒకరు. ఇప్పుడామె మళ్లీ వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఆమె ఎమ్మెల్సీ స్థానం ఉంది కాబట్టి, ఉప ఎన్నికలు జరిగినా తిరిగి ఆమెకు టీడీపీ తరపున అదే పదవి దక్కే అవకాశముంది. సో సేఫ్ జోన్ చూసుకునే ఆమె రాజీనామా చేశారనుకోవాలి.
విలువలు, విశ్వసనీయత..
2014లో పదవులకు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకపోయినా నాయకులకు టీడీపీ కండువాలు కప్పారు చంద్రబాబు. 2024నాటికి ఆయన మాట మార్చారు. విలువలు, విశ్వసనీయత అంటున్నారు. అయితే ఇక్కడో చిన్న లాజిక్ ఉంది. 2019లో జగన్ కూడా ఇవేమాటలు చెప్పారు కానీ అవి ఎమ్మెల్సీలకే వర్తించాయి. టీడీపీ, జనసేన నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలు పార్టీలకు రాజీనామాలు చేశారే కానీ, పదవులకు కాదు. ఎమ్మెల్యేలకు వైసీపీ కండువాలు కప్పకుండా, వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు వైసీపీ సభ్యత్వం ఇచ్చి జగన్ సరికొత్త రాజకీయానికి తెరతీశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ రూట్లోనే వెళ్తారేమో చూడాలి. మొత్తమ్మీద చంద్రబాబు కూడా పాత పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసినవారికే తన పార్టీలో చోటిస్తానని చెప్పడం ఇక్కడ విశేషం.