ఆ తర్వాతే బయటకు రండి -చంద్రబాబు

చంద్రబాబు పైకి ధీమాగా ఉన్నా.. ఆరా సర్వేతోపాటు, మరికొన్ని ప్రామాణిక సంస్థలు చేసిన సర్వేలు కూటమిలో గుబులు రేపాయి.

Advertisement
Update:2024-06-03 04:51 IST

ఎన్నికల కౌంటింగ్ వేళ.. పార్టీ అధినాయకత్వాలు అభ్యర్థులకు కీలక సూచనలు చేస్తున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. పక్క పార్టీ వాళ్లు రెచ్చగొడతారు, గొడవలకు దిగుతారు.. మీరు సంయమనం పాటించండి అంటూ సొంత పార్టీ నేతలకు చెబుతున్నారు. మరోవైపు ఎక్కడా అక్రమాలను సహించొద్దని సూచిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కూడా కూటమి అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. వైసీపీ వాళ్లు అక్రమాలకు, దాడులకు తెగబడే అవకాశం ఉందని, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారాయన.

కూటమి అభ్యర్థులు గెలుపు ప్రకటన విని రిలాక్స్ కావొద్దని సూచించారు చంద్రబాబు. ఆర్వో నుంచి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలన్నారు. కూటమి అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు మూడు పార్టీల నేతలు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ ఏజెంట్లు, చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు. అధికారులు నిబంధనలు పాటించేలా ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి తీసుకొచ్చే సమయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకూ అలర్ట్ గా ఉండాలన్నారు చంద్రబాబు.

ముందుగానే శుభాకాంక్షలు..

ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత జరిగిన తొలి మీటింగ్ లో చంద్రబాబు తమ పార్టీ నేతలకు, అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమన్వయంతో పనిచేశారన్నారు. మూడు పార్టీల నేతలు బాగా కష్టపడ్డారంటూ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. పైకి ధీమాగా ఉన్నా.. ఆరా సర్వేతోపాటు, మరికొన్ని ప్రామాణిక సంస్థలు చేసిన సర్వేలు కూటమిలో గుబులు రేపాయి.

Tags:    
Advertisement

Similar News