అప్పట్లో గుడివాడ అంటే క్యాసినో, బూతులు..

ఎన్టీఆర్ మొదటిసారిగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ కావడంతో.. ఇక్కడ తాను అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని చెప్పారు సీఎం చంద్రబాబు.

Advertisement
Update:2024-08-15 15:28 IST

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు గుడివాడలో అన్న క్యాంటీన్ ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, ఇకపై పేదవాడికి 5 రూపాయలకే కడుపునింపే క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చేశాయని చెప్పారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఉద్దేశపూర్వకంగా మూసేసిందని, దాతల సాయంతో నిర్వహించుకుంటామని చెప్పినా పేదల నోటి దగ్గర కూడు లాగేసిందని.. ఇప్పుడు పేదలకు అండగా తమ ప్రభుత్వం నిలబడిందని చెప్పారు సీఎం చంద్రబాబు.


ఎన్టీఆర్ మొదటిసారిగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ కావడంతో.. ఇక్కడ తాను అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని చెప్పారు సీఎం చంద్రబాబు. గుడివాడ అంటే గతంలో క్యాసినోలు కనపడేవని, ఆ ఎమ్మెల్యే బూతులు మాట్లాడేవారని.. ఇప్పుడు ఎక్కడైనా బూతులు వినపడుతున్నాయా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు చంద్రబాబు. గత 5 ఏళ్ళు ఏపీలో స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి కూడా అవకాశం లేదని, బయటకు రావటానికి వీలు లేదని చెప్పారు. వైసీపీ పాలనలో సీఎం బయటకు వస్తున్నాడంటే ఎక్కడికక్కడ చెట్లు కొట్టేసేవారని, పరదాలు కట్టేసే వారని సెటైర్లు పేల్చారు చంద్రబాబు. ఈ రోజు అందరూ స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు.


గుడివాడలోనే మొత్తం 3 క్యాంటీన్లు పెట్టామని, రాష్ట్రంలో మొత్తంగా 203 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు చంద్రబాబు. పేదవారికి తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత అని చెప్పిన ఆయన.. ఇందుకు హరేకృష్ణ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ముందుకు రావడం సంతోషకరమైన విషయం అన్నారు. ప్రతి రోజూ లక్షమందికి పైగా అన్న క్యాంటీన్లలో ఆహారం అందిస్తామని, ఆదివారం సెలవు అని చెప్పారు. అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు కూడా సేకరిస్తున్నామంటూ బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలిపారు చంద్రబాబు. 



Tags:    
Advertisement

Similar News