ఆర్థిక ఉగ్రవాదులు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని.. డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని అన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని, ఆర్థిక సాయం కోరానని చెప్పారు.

Advertisement
Update:2024-07-11 15:34 IST

అనకాపల్లి జిల్లా పర్యటనలో ప్రతిపక్ష వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో విశాఖను దోచుకున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో 3 చక్కెర కర్మాగారాలను పడకేసే పరిస్థితికి తీసుకొచ్చారని, రైతులకు న్యాయం చేయడం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని వివరించారు. అబద్ధాలు చెప్పే నేతల వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఖండించాలన్నారు. కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.


అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తేనే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకోసం రూ.800 కోట్లు ఖర్చు చేస్తే, లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని, ఈ జిల్లాకు సాగునీరు అందిస్తేనే తన జన్మ సార్థకం అవుతుందని ఉద్వేగ భరితంగా ప్రసంగించారు చంద్రబాబు.

రాష్ట్రం నిలదొక్కుకునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని, భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు చంద్రబాబు. వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని.. డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని మరోసారి గుర్తు చేశారు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని, ఆర్థిక సాయం కోరానని చెప్పారు. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేసి, రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తామన్నారు చంద్రబాబు. టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు 72 శాతం పూర్తయ్యాయని చెప్పారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని ఎద్దేవా చేశారు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు చంద్రబాబు.

Tags:    
Advertisement

Similar News