టీడీపీపై నమ్మకం కోల్పోయిన చంద్రబాబు
గతంలో మోడీని టెర్రరిస్టుగా అభివర్ణించారు. మోడీపై వ్యక్తిగత దూషణలు చేశారు. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం చంద్రబాబు మోడీ ప్రాపకం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ పేరు చెప్పి ప్రజలను నమ్మించలేనని అనుకున్నారో, తనకే తన పార్టీ మీద నమ్మకం పోయిందో తెలియదు గానీ ప్రజలకు పిలుపునిచ్చే క్రమంలో తన గొంతు మార్చారు. ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. కూటమిని గెలిపించాలని కూడా ఆయన కోరడం లేదు. ఎన్డీఏ అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు గుర్తు వస్తారని, మోడీని చూసి ప్రజలు ఓట్లు వేస్తారని ఆయన అనుకుంటున్నారు.
టీడీపీ ఒక్కటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎదుర్కోలేదని చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు. అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను తోడు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు కోసం ఆ పార్టీ పెద్దల వద్ద సాష్టాంగపడ్డారు. బేషరతుగా బీజేపీతో పొత్తుకు సిద్ధపడ్డారు. మోడీకున్న ప్రజాదరణను సొమ్ము చేసుకుందామనే ఉద్దేశంతో ఆయన ప్రస్తుతం ఉన్నారు. దానివల్లనే ఆయన ఎన్డీఏకు ఓటేయాలని అడుగుతున్నారు.
గతంలో మోడీని టెర్రరిస్టుగా అభివర్ణించారు. మోడీపై వ్యక్తిగత దూషణలు చేశారు. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం చంద్రబాబు మోడీ ప్రాపకం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మోడీ చరిష్మాపై ఆధారపడినంతగా చంద్రబాబు తన అనుభవం మీద ఆధారపడినట్లు కనిపించడం లేదు.
ప్రజలకు స్పష్టమైన హామీలు ఇవ్వడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తానని చెబుతున్నారు. కూటమిలో టీడీపీ అతి పెద్ద భాగస్వామి. ఇతర పార్టీలు చాలా చిన్నవి. నిజానికి చిన్న పార్టీలు పెద్ద పార్టీ మీద ఆధారపడాలి. కానీ, చంద్రబాబు చిన్నపార్టీలపై ఆధారపడి ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. తనపై తనకు నమ్మకం లేకపోవడం, తన పార్టీపై తనకు విశ్వాసం లేకపోవడం చంద్రబాబు నడతలోనూ, మాటల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.