నా జన్మ ధన్యమైంది.. జైలు బయట చంద్రబాబు ఫస్ట్ స్పీచ్
చంద్రబాబు రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు షరతులు విధించింది. అయితే ఆయన నర్మగర్భంగా తన కేసుల వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
కండిషన్ బెయిలుపై జైలునుంచి బయటకొచ్చిన చంద్రబాబు సైలెంట్ గా వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు కానీ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలందరికీ మనస్పూర్తిగా నమస్కారాలు, అభినందనలు.. అంటూ స్పీచ్ మొదలు పెట్టారు. తాను కష్టంలో ఉన్నప్పుడు 52రోజులుగా తెలుగుప్రజలు రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారని, పూజలు చేశారని, ఏపీలోనే కాకుండా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగుప్రజలు తనపై చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పుడూ మరువలేనని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూపిన అభిమానంతో తన జన్మ ధన్యమైందని, ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి కూడా రాదని చెప్పారు చంద్రబాబు.
నర్మగర్భంగా రాజకీయ వ్యాఖ్యలు..
చంద్రబాబు రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు షరతులు విధించింది. అయితే ఆయన నర్మగర్భంగా తన కేసుల వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 45సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తాను ఏ తప్పుచేయలేదని, తప్పుచేయడానికి ఎవర్నీ అనుమతించలేదన్నారు చంద్రబాబు. జనసేనపార్టీ బహిరంగంగా వచ్చి తనకు సంఘీభావం తెలిపిందని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. సంఘీభావం తెలిపిన సీపీఐ, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీ ల నాయకులకు కూడా అభినందనలు తెలిపారు చంద్రబాబు.
ఫుల్ అప్ డేట్..
జైలులో ఉన్నా కూడా చంద్రబాబు అన్ని విషయాల్లోనూ అప్ డేట్ గానే ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు తన కోసం సైకిల్ యాత్ర చేసిన వారిని అభినందిస్తున్నానని చెప్పారు చంద్రబాబు. హైదరాబాద్ లో ఐటీ ప్రొఫెషనల్స్ సైబర్ టవర్స్ నిర్మించి 25సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తనకు సంఘీభావం తెలిపారని, వారిని జీవితంలో మరువలేనని చెప్పారు. 45సంవత్సరాల ప్రజాజీవితంలో తాను చేసిన పనులను జైలులో నెమరువేసుకున్నానన్నారు. మీడియా కూడా పెద్దఎత్తున సహకరించిందని చెప్పిన చంద్రబాబు జర్నలిస్ట్ లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.