తిరుమల నుంచే ప్రక్షాళణ మొదలు -చంద్రబాబు

తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అంటూనే.. గత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు చంద్రబాబు. తిరుమల నుంచే ప్రక్షాళణ మొదలు పెడతామని చెప్పారు.

Advertisement
Update:2024-06-13 12:13 IST

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు అక్కడే తొలిసారి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉండాలని, భారత్ లో ఏపీ అగ్రరాష్ట్రంగా ఉండాలని ఆ దేవదేవుడ్ని ప్రార్థించినట్టు తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అంటూనే.. గత ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారాయన. తిరుమల నుంచే ప్రక్షాళణ మొదలు పెడతామని చెప్పారు చంద్రబాబు.


తాను 5 కోట్ల మంది ప్రజల మనిషినని, అందరివాడినని చెప్పుకొచ్చారు చంద్రబాబు. వాస్తవాలను చెప్పలేని దుస్థితిని మీడియా ఎదుర్కొంటోందన్నారు. కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, ఈ ప్రభుత్వంలో ప్రజా పాలన సాగుతుందని భరోసా ఇచ్చారు. 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు చంద్రబాబు. అమరావతి, పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఏపీతోపాటు, తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలన్నారు. తిరుమల పవిత్రమైన దివ్యక్షేత్రం అని, ఈ క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదన్నారు.

నేరాలు చేసి తప్పించుకోవాలనుకునేవారిని వదిలిపెట్టబోమన్నారు చంద్రబాబు. నేరం వేరే వాళ్లపై వేయడానికి ప్రణాళికలు వేసిన వారికి కూడా శిక్షలు పడేలా చేస్తామన్నారు. గత ప్రభుత్వం తిరుమలను ధనార్జన కేంద్రంగా మార్చిందన్నారు. విపరీతమైన రేట్లు., బ్లాక్ మార్కెట్ లో టికెట్ల విక్రయం ఉండకూడదన్నారు. గంజాయి, అన్యమత ప్రచారం, మద్యం, మాంసం.. అంటూ విచ్చలవిడిగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ఇష్టానుసారం వారికి నచ్చిన వారికి పదవులు ఇచ్చారని, పెళ్లిళ్లు పేరంటాలకు స్వామి వారిని అమ్మే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎర్ర చందనం స్మగ్లర్లకు సీట్లు ఇచ్చారన్నారు. దృఢ సంకల్పంతో చెడును అణచి వేస్తానని హెచ్చరించారు చంద్రబాబు. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానన్నారు. 

Tags:    
Advertisement

Similar News