అమరావతే రాజధాని

టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని, ప్రపంచపటంలో అమరావతిని గొప్పగా నిలబెడతానని శపథం చేశారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అందరినీ భ్రమల్లో ముంచేసి తర్వాత అందరినీ మోసం చేసినట్లు మండిపడ్డారు.

Advertisement
Update:2023-04-28 11:04 IST

అమరావతే రాజధాని

ఇంతకాలానికి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. రాజధాని నియోజకవర్గం తాడికొండలో గురువారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతే కంటిన్యూ అవుతుందన్నారు. మూడు రాజధానులు అనేదే ఉండదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని, ప్రపంచపటంలో అమరావతిని గొప్పగా నిలబెడతానని శపథం చేశారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అందరినీ భ్రమల్లో ముంచేసి తర్వాత అందరినీ మోసం చేసినట్లు మండిపడ్డారు.

ఎన్నికల సమయంలోనే మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను ప్రకటించి ఉంటే జగన్‌కు జనాలంతా బుద్ధిచెప్పేవారన్నారు. అమరావతి నిర్మాణానికి అన్నివర్గాలవారు భూములిస్తే ఒక కులం కోసమే అమరావతి అనే ముద్ర వేసినట్లు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే కుట్రలు చేసి అమరావతి కాన్సెప్ట్‌ను జగన్ చంపేశారంటూ రెచ్చిపోయారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు ఏమున్నాయని అడుగుతున్న వారంతా కనిపిస్తున్న బ్రహ్మాండమైన భవనాలపైనుండి దూకితే శని విరగడవుతుందని చెప్పారు.

మొత్తానికి జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ చంద్రబాబును ఎంతగా ఇబ్బంది పెడుతోందో మరోసారి బటయపడింది. రూ. 5 లక్షల కోట్లుంటే ప్రపంచ స్థాయి రాజధాని వచ్చేదని, తర్వాత లక్షల కోట్ల సంపద సృష్టి జరిగేదనే పాతపాటనే చంద్రబాబు వినిపించారు. లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసమే రూ. 5 లక్షల కోట్లు ఎలా వస్తుందంటే సమాధానం ఉండదు. కేంద్రమే విడతలవారీగా లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు మొదటి విడతగా రూ. 1.10 లక్షల కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపారు.

కేంద్రం అంతమొత్తం ఇస్తుందా? ఇచ్చే పరిస్థితుల్లో ఉందా అంటే మాట్లాడరు. ఒక వైపేమో లక్షల కోట్లు అవసరమంటూనే మరోవైపు అమరావతి కాన్సెప్ట్‌ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని సంబంధం లేని మాటలు చెబుతున్నారు. ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడారు కాబట్టే జగన్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. సరే ఏదేమైనా మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అమరావతే రాజధానిగా ఉంటుందని బహిరంగంగా ప్రకటించారు. ఇంతకాలం జగన్ కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తున్నారంతే. ఇప్పుడు స్పష్టంగా అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News