మేనిఫెస్టో జనాల్లోకి వెళ్లలేదా..? చంద్రబాబు ఏమన్నారంటే..?

మేనిఫెస్టో ప్రచారం విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఐటీడీపీ మీటింగ్ పెట్టి అందరికీ మరోసారి మేనిఫెస్టోని మోయాలని సూచించారు.

Advertisement
Update:2023-06-10 05:58 IST

ఆడబిడ్డ నిధి, అమ్మకు వందనం, నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు, ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఇలా ఎన్నికలకు ఏడాది ముందే టీడీపీ మేనిఫెస్టో పార్ట్-1 ని విడుదల చేసింది. పథకాలు బాగున్నాయి కానీ జనం ఈ మేనిఫెస్టోని లైట్ తీసుకున్నారనే విషయం రోజుల వ్యవధిలోనే తేలిపోయింది. పథకాల గురించి ఎక్కడా చర్చలేకపోగా.. వైసీపీ నెగెటివ్ ప్రచారం బాగా చేసింది. ఎన్నికలు అయిపోయాగనే మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసే సంప్రదాయం ఉన్న చంద్రబాబు.. ఇలాంటి పథకాలు ఎన్ని ప్రకటించినా ఉపయోగం లేదన్నారు వైసీపీ నేతలు. పైగా అది కర్నాటక మిక్సింగ్ మేనిఫెస్టో అని, తమ పథకాలకు బాబు కేవలం పేరు మార్చారని కూడా గుర్తు చేశారు. దీంతో సహజంగానే టీడీపీ మేనిఫెస్టో కాస్త కంగాళీగా మారింది. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఐటీడీపీ నేతల సమావేశంలో అదే విషయాన్ని నొక్కి చెప్పారు.

టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి విషయం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ మేనిఫెస్టోలోని అంశాలను చేరవేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు సూచించారు చంద్రబాబు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఐ-టీడీపీ ఆర్గనైజేషన్‌ పనితీరు బాగుందని కితాబిచ్చారు. ఏ సందేశమైనా కార్యకర్తలకు వెంటనే చేరిపోతోందన్నారు. మేనిఫెస్టోని కూడా పగడ్బందీగా జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.


సోషల్ మీడియాలో వైసీపీ జోరు..

మీడియా, సోషల్ మీడియాలో టీడీపీ హవా ఉన్నా కూడా ఇటీవల వైసీపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కూడా అదిరిపోయే కౌంటర్లు రెడీ చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు సోషల్ మీడియా ప్రచారంపై గట్టి ఫోకస్ పెట్టారు. మేనిఫెస్టో ప్రచారం విషయంలో కూడా ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఐటీడీపీ మీటింగ్ పెట్టి అందరికీ మరోసారి మేనిఫెస్టోని మోయాలని సూచించారు. జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు. చర్చ మొదలు పెట్టాలని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News