నాపై దాడి చేస్తారు, నన్ను అరెస్ట్ కూడా చేస్తారేమో..!
తాను నిప్పులా బతికానని, ఏ తప్పూ చేయలేదని ఐటీ నోటీసులపై పరోక్షంగా స్పందించారు చంద్రబాబు. తనపై దాడి చేసేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్ట్ లు చేస్తున్నారని, రేపో ఎల్లుండో తనను కూడా అరెస్ట్ చేస్తారని అన్నారు చంద్రబాబు. అనంతపురం పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో అన్నీ అరాచకాలేనన్నారు చంద్రబాబు. ఇసుక అక్రమాలపై ఎన్జీటీలో కేసులు వేసినందుకు నాగేంద్ర అనే వ్యక్తిని వేధిస్తున్నారని చెప్పారు. తాను నిప్పులా బతికానని, ఏ తప్పూ చేయలేదని ఐటీ నోటీసులపై పరోక్షంగా స్పందించారు చంద్రబాబు. తనపై దాడి చేసేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వివేకా హత్య జరిగిన మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని రాసుకొచ్చారని, తనపై అనేక రకాలుగా అపవాదులు వేశారని, రివర్స్ లో కేసులు పెడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. అంగళ్లులో తనపై హత్యాయత్నం చేసి తిరిగి తనపైనే 307 కేసు పెట్టారన్నారు. యువగళంకు వచ్చి దాడులు చేసి, చివరకు యువగళంలో ఉన్నవారిపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. సీఎం జగన్ పథకాల పేరుతో ప్రజలకు ఇచ్చిన డబ్బులకంటే పేపర్ ప్రకటనలకే ఎక్కువ ఇచ్చారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.
ష్యూరిటీ, గ్యారెంటీ..
పేద ప్రజలకు తాను ష్యూరిటీ ఇస్తున్నానని, వారిని ధనవంతులుగా మార్చే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఎన్నికల వేళ ఇస్తున్న హామీలను వందశాతం నెరవేరుస్తామని చెప్పారు. ఆ హామీలకు తనదే గ్యారెంటీ అన్నారు బాబు.
ట్రీట్ మెంట్ కోసమా..?
తనపై తప్పుడు కేసులు పెట్టి సీఎం జగన్ లండన్ వెళ్లారని, అక్కడ ఏం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారో ఎవరికి తెలుసన్నారు చంద్రబాబు. జగన్ ట్రీట్ మెంట్ కోసమే లండన్ వెళ్లారని ఎద్దేవా చేశారు.