మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాయాలి.. లోకేష్ కి చంద్రబాబు ఉపదేశం

లోకేష్ తో చంద్రబాబు వన్ టు వన్ మాట్లాడారని, ఆ సారాంశం ఇదేనంటూ పార్టీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాయాలంటూ చంద్రబాబు, లోకేష్ కి దిశా నిర్దేశం చేశారని పార్టీ పేర్కొంది.

Advertisement
Update:2022-10-27 21:15 IST


ఓవైపు సీఎం జగన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో నాయకులతో సమీక్షలు నిర్వహిస్తూ.. గెలుపు మంత్రం ఉపదేశిస్తుంటే, ఇటు చంద్రబాబు కూడా సమీక్షలతో హడావిడి చేస్తున్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంపై కొడుకు లోకేష్ తో ఆయన సమీక్ష నిర్వహించారు. లోకేష్ తో చంద్రబాబు వన్ టు వన్ మాట్లాడారని, ఆ సారాంశం ఇదేనంటూ పార్టీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాయాలంటూ చంద్రబాబు, లోకేష్ కి దిశా నిర్దేశం చేశారని పార్టీ పేర్కొంది.

ఇటీవల పలు నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు, స్థానిక నాయకులకు చీవాట్లు పెట్టారు. ఉంటే ఉండండి, పోతే పొండి అంటూ ఘాటుగా మాట్లాడారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడినందుకు సంతోషంగానే ఉన్నా, పార్టీ పరిస్థితి దిగజారుతుంటే మాత్రం ఇన్ చార్జ్ లను మార్చేస్తానంటూ హెచ్చరించారు. మంగళగిరి విషయంలో మాత్రం చంద్రబాబు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు.

లోకేష్ వివరణ ఏంటంటే..?

మంగళగిరిలో తాను చేపట్టిన కార్యక్రమాల గురించి లోకేష్, చంద్రబాబుకి వివరణ ఇచ్చారని సమాచారం. తాను ఓడిపోయినా అదే నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ ప్రజలకు చేరువ కాగలిగానంటూ లోకేష్ చంద్రబాబుకి చెప్పారట. టీడీపీ అందించే సహాయాలే కాకుండా తాను 12కి పైగా సంక్షేమ కార్యక్రమాలను అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజల మనసులు గెలుచుకున్నానని చెప్పారట లోకేష్. గత ఎన్నికల్లో ఓటమిని పట్టించుకోకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాయాలని లోకేష్ కి చంద్రబాబు చెప్పారు. సమష్టిగా పనిచేయాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిరుగులేని విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు చంద్రబాబు.

మొత్తమ్మీద కొడుకు నియోజకవర్గంపై తండ్రి సమీక్ష నిర్వహించడం, పనితీరు బాగుందని మెచ్చుకోవడం, చరిత్ర తిరగరాసే మెజార్టీ సాధించాలని ఆశీర్వదించడం.. ఇవన్నీ పార్టీ శ్రేణులకు సంతోషం కలిగిస్తున్నా, వైరి వర్గాలు మాత్రం సెటైర్లు పేలుస్తున్నాయి. కొడుకుని తండ్రి మెచ్చుకోవడం, తండ్రిని కొడుకు అభినందించడం.. చివరకు ఆ పార్టీలో వారిద్దరే ఒకరినొకరు పొగుడుకుంటూ కూర్చోవాల్సి వస్తోందని వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

Tags:    
Advertisement

Similar News