చంద్రబాబు అరెస్టు.. తెలంగాణలో సంబరాలు

చంద్రబాబు నోరు తెరిస్తే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పింది నేనే.. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే అంటూ పదే పదే చెప్పుకోవడం రుచించలేదు.

Advertisement
Update:2023-09-11 16:13 IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టు జడ్డి ఇచ్చిన తీర్పు బయటకు వచ్చిన వెంటనే వైసీపీ శ్రేణులు సంబరాల్లో ముగినిపోయాయి. చంద్రబాబు అరెస్టు వార్త తెలంగాణలో కూడా సంబరాలకు కారణం అయ్యింది.

చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా తలదూర్చడం లేదు. పైగా ఈ కేసుతో తెలంగాణకు గానీ, ఇక్కడ ప్రజలకు కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్టును సెలబ్రేట్ చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజానీకం అరెస్టును స్వాగతించడం విశేషం. చంద్రబాబు పట్ల ఇక్కడి ప్రజానీకానికి ఎంత కోపం ఉన్నదో ఈ సంబరాలు తెలియజేస్తున్నాయి.

చంద్రబాబు నోరు తెరిస్తే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పింది నేనే.. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే అంటూ పదే పదే చెప్పుకోవడం రుచించలేదు. మరో వైపు తెలంగాణ ప్రజలు తమ సొంత కుటుంబ సభ్యులుగా ఫీల్ అయిన నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది చంద్రబాబే అనే కోపం కూడా ఉన్నది. గద్దర్‌పై జరిగిన కాల్పుల వెనుక ఉన్నది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఇటీవల గద్దర్ చనిపోయిన సమయంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు. స్వయంగా గద్దర్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గద్దరపై కాల్పులకు తనకు సంబంధం లేదని చెప్పడం తెలంగాణ సమాజంలో ఆగ్రహాన్ని తెప్పించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కూడా చంద్రబాబు తెరవెనుక అడ్డుపడ్డాడనే కోపం కూడా ఇక్కడి ప్రజల్లో ఉన్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి ప్రయత్నించాడన్న కోపం బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది. ఇలా చంద్రబాబుపై కోపానికి ఒక్కో వర్గానికి ఒక్కో రకమైన కారణం ఉన్నది. విద్యుత్ ఉద్యమ సమయంలో చంద్రబాబు చేసిన దాష్టీకం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. అందుకే ఈ రోజు చంద్రబాబు అరెస్టు వార్త చూడగానే.. తమకు సంబంధం లేని కేసు అయినా తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

సోషల్ మీడియాను పరిశీలించినా వైసీపీ వర్గాలకు మించి తెలంగాణ వారి పోస్టులే ఎక్కువగా కనపడుతున్నాయి. బీఆర్ఎస్ అభిమానులే కాకుండా జర్నలిస్టులు, లాయర్లు, పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా ఇలా సంతోషపడిన వారిలో ఉండటం గమనార్హం. కేసీఆర్ కేవలం చంద్రబాబును ఏపీకి తరిమేసి ఊరుకున్నాడు. కానీ, జగన్ మాత్రం బాబుతో ఊచలు లెక్కిస్తున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబుపై ఇన్నాళ్లూ దాచుకున్న ఆక్రోశాన్ని తెలంగాణ ప్రజలు ఇవ్వాళ సంబరాల రూపంలో బయట పెట్టుకున్నారు.

Tags:    
Advertisement

Similar News