ఏపీలో హింసపై ఈసీ సీరియస్‌.. 15 మంది అధికారులపై వేటు

ఏపీలో పోలింగ్ పూర్తయిన రాత్రి, మరుసటి రోజు పలు ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది. ప్రధానంగా తాడిపత్రి, మాచర్ల, తిరుపతిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి.

Advertisement
Update:2024-05-16 22:12 IST

ఏపీలో పోలింగ్‌ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా రియాక్ట్ అయింది. అల్లర్లపై ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇచ్చిన వివరణతో పల్నాడు కలెక్టర్‌తో పాటు మొత్తం 15 మంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. ఈ అధికారులందరిపై శాఖపరమైన చర్యలకు ఈసీ ఆదేశించింది.

పల్నాడు జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు వేసిన ఈసీ.. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖపరమైన విచారణకు ఆదేశించింది. వీరితో పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి మూడు జిల్లాల పరిధిలోని 12 మంది సబార్డినేట్‌ పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిపైన కూడా శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ అల్లర్లపై సిట్‌ ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ. FIR అప్డేట్ చేసి తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సూచించింది. ఇక కౌంటింగ్‌ తర్వాత ఎలాంటి అల్లర్లు, హింస చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా కౌంటింగ్ తర్వాత కూడా రాష్ట్రంలో 15 రోజుల పాటు 25 కేంద్ర పారామిలిటరీ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ.

ఏపీలో పోలింగ్ పూర్తయిన రాత్రి, మరుసటి రోజు పలు ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది. ప్రధానంగా తాడిపత్రి, మాచర్ల, తిరుపతిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో వందల మందికి గాయాలయ్యాయి. తిరుపతి, తాడిపత్రిలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన పరిస్థితి కూడా ఉంది. తాడిపత్రి, మాచర్ల ఏరియాల్లో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈ అల్లర్లను సీరియస్‌గా తీసుకున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్.. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని వివరణ తీసుకుంది.

Tags:    
Advertisement

Similar News