తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో హవాలా సొమ్ము
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పెద్ద మొత్తంలో నగదు, నగలు, ఇతర బహుమతులు పట్టుబడుతున్నాయి. కర్నాటక నుంచి తరలించే సొమ్ముపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు పోలీసులు. ఏపీ సరిహద్దుల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి తరలిస్తున్న సొమ్ము భారీగా పట్టుబడటం గమనార్హం. ఆ మధ్య కర్నాటకలో లారీల్లో తరలిస్తున్న సొమ్ముని సీజ్ చేశారు అధికారులు, ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి వ్యవహారమే బయటపడింది. విశాఖలో డబ్బుని వాషింగ్ మెషిన్లలో పెట్టి తరలించడం కొసమెరుపు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి వాషింగ్ మెషిన్లలో దాచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 1.30 కోట్ల రూపాయలు, 30 సెల్ ఫోన్లు సీజ్ చేశారు.
ఎవ్వరికీ అనుమానం రాకుండా..
హవాలా సొమ్ము తరలించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. విశాఖలో నోట్ల కట్టలను ఎవరికీ అనుమానం రాకుండా వాషింగ్ మెషిన్లలో పెట్టారు. వాటిని ఆటోలో తరలిస్తున్నారు. దసరా సీజన్లో ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో వాషింగ్ మెషిన్లు తరలిస్తున్న ఆటోపై ఎవరికీ అనుమానం రాలేదు. కానీ పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. ఎన్ఏడీ జంక్షన్ వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీసులు ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత పెద్ద మొత్తంలో నగదు, నగలు, ఇతర బహుమతులు పట్టుబడుతున్నాయి. కర్నాటక నుంచి తరలించే సొమ్ముపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు పోలీసులు. ఏపీ సరిహద్దుల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ దశలో విశాఖలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడటం విశేషం. ఈ సొమ్ముకి, తెలంగాణ ఎన్నికలకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దొంగ సొమ్ము కాకపోతే వాషింగ్ మెషిన్లలో ఎందుకు తరలిస్తారని అంటున్నారు.
♦