పోలీసులపై దాడులకు పాల్పడిన టీడీపీ కేడర్‌పై కేసులు
కానిస్టేబుల్ జయశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చల్లా రామచంద్రారెడ్డితో పాటు మరో 16 మంది టీడీపీ కార్యకర్తలు, ఇతరులపై ఎఫ్ఐఆర్ రికార్డు అయ్యింది.
పుంగనూరు, అంగళ్ల ఘటనలో పోలీసులపై దాడులకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పోలీసులే ఫిర్యాదుదారులుగా వివిధ సెక్షన్ల కింద మొత్తం వంద మందికి పైగా 4కేసులు పెట్టారు. సీఐ నెల్లి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసులో పుంగనూరు తెలుగుదేశం ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తో పాటు మరో 39 మంది తెలుగుదేశం కార్యకర్తలు, ఇతరులపై కేసు నమోదైంది.
కానిస్టేబుల్ జయశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చల్లా రామచంద్రారెడ్డితో పాటు మరో 16 మంది టీడీపీ కార్యకర్తలు, ఇతరులపై ఎఫ్ఐఆర్ రికార్డు అయ్యింది. పోలీసు అధికారి నాగరాజా ఫిర్యాదుతో చల్లా రామచంద్రా రెడ్డితో పాటు 19 మంది తెలుగుదేశం కేడర్ పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పాలసముద్రం ఎస్ఐబి ప్రసాద్ ఫిర్యాదుతో చల్లా రామచంద్రారెడ్డి, మరో 37 మంది టీడీపీ కార్యకర్తలతో పాటు ఇతరులపై హత్యాయత్నం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
టీడీపీ కేడర్ ఆచూకీపై ఆందోళన
పుంగనూరు, అంగళ్ల ఘటనలకు సంబంధించి పెద్దిరెడ్డి, అతని కుటుంబ సభ్యులపై హత్యాయత్నం కేసు పెట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యుల్ని వదిలేసి బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే 25మందిని అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.