తిరుమల టికెట్ల గోల్ మాల్.. వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గుంటూరు వాసుల నుంచి తోమాల టికెట్లకోసం రూ.3లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో తిరుమల టికెట్ల విషయంలో అవినీతి జరిగిందని, దాన్ని ప్రక్షాళణ చేస్తామని టీడీపీ మొదటినుంచీ చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ భరత్, ఆయన పీఆర్వోపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తోమాల సేవ పేరిట సిఫారసు లేఖలు విక్రయించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాకు చెందిన భరత్ పై గుంటూరులోని అరండల్‌పేటలో కేసు నమోదు కావడం విశేషం. భరత్ ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా వైసీపీ నుంచి పోటీ చేశారు.
టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గుంటూరు వాసుల నుంచి తోమాల టికెట్లకోసం రూ.3లక్షలు వసూలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. తిరుమల టికెట్లు అమ్ముకున్నారంటూ వైసీపీ నేతలపై ఇప్పటి వరకు కేవలం ఆరోపణలే వినిపించాయి. మాజీ మంత్రి రోజాపై కూడా ఈ ఆరోపణలున్నాయి. కానీ, ఎక్కడా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తాజాగా ఎమ్మెల్సీ భరత్ పై మాత్రం కేసు నమోదు కావడం విశేషం.
అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు..
తనపై నమోదైన కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ భరత్ ఓ వీడియో విడుదల చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని అన్నారాయన. తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని, తాను ఉన్నత విలువలతో బతికే వ్యక్తినని చెప్పారు భరత్. అసలు తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్‌ఓ ఎవరూ లేరన్నారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం, అక్కడ టీడీపీని ఎదుర్కొంటూ వైసీపీని బలపరచడంతో తనపై కక్షగట్టారని ఆరోపించారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకే కేసులు నమోదు చేశారన్నారు. ఈ కుట్రలను చట్టపరంగా తాను ఎదుర్కొంటానన్నారు భరత్.