అచ్చెన్నాయుడుపై కుప్పంలో కేసు నమోదు
అధికారులు లోకేష్ పాదయాత్రకి 500 మంది పోలీసులతో భద్రత కల్పించామని చెబుతున్నారంటూ అచ్చెన్నాయుడు పోలీసులను బూతులు తిట్టారు. అసభ్యపదజాలంతో మాట్లాడారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెనాయుడుపై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. సెక్షన్ 153 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా తొలి రోజు కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోలీసులను ఉద్దేశించి అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ పాదయాత్రకు 500 మంది పోలీసులతో భద్రత కల్పించామని పోలీసులు చెప్పడాన్ని అచ్చెన్నాయుడు తప్పు పట్టారు. అధికారులు లోకేష్ పాదయాత్రకి 500 మంది పోలీసులతో భద్రత కల్పించామని చెబుతున్నారంటూ అచ్చెన్నాయుడు పోలీసులను బూతులు తిట్టారు. అసభ్యపదజాలంతో మాట్లాడారు.
టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను ఆదుకుంటామంటారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులపై ఆధారపడుతుంటారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కానీ, ఈసారి పరిస్థితి అలా ఉండదన్నారు. అచ్చెన్నాయుడు పోలీసులను బూతులు తిడుతూ చేసిన వ్యాఖ్యలపై కుప్పం ఎస్ఐ ఫిర్యాదు మేరకు సెక్షన్ 153 కింద కేసు నమోదు అయింది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఏపీ పోలీసుల సంఘం కూడా ఖండించింది. టీడీపీ నేతలు పదేపదే ఇటీవల పోలీసులను బూతులు తిట్టడం, తాము అధికారంలోకి వస్తే అంతు తేలుస్తామంటూ హెచ్చరించడం పరిపాటిగా మారింది.