వాహనాలు పెట్టలేం.. దారిఖర్చులిస్తాం.. ఏపీలో ఓటేయడానికి రండి
మే 13న ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ ఉండటంతో సరిపడా ప్రైవేట్ వాహనాలు అందుబాటులో లేవని ఏపీలోని అభ్యర్థులు హైరానా పడుతున్నారు.
తెలంగాణలోని ఏపీ ఓటర్లను ఆ రాష్ట్రానికి రప్పించడానికి అక్కడి అభ్యర్థుల కిందా మీదా పడుతున్నారు. తెలంగాణలో కూడా మే 13నే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో వాహనాల అందుబాటు కష్టమవుతోందని కంగారుపడుతున్నారు. ఏపీకి తీసుకెళ్లడానికి వాహనాలు పెట్టలేమని, రానూపోనూ దారి ఖర్చులిస్తాం.. ఓటేయడానికి రమ్మని అభ్యర్థిస్తున్నారు.
మే 13న ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ ఉండటంతో సరిపడా ప్రైవేట్ వాహనాలు అందుబాటులో లేవని ఏపీలోని అభ్యర్థులు హైరానా పడుతున్నారు. బస్సులు, రైళ్లలో గానీ కుదరకపోతే ప్రైవేట్‌గా మీరే వాహనాల్ని పెట్టుకుని రండి.. దారి ఖర్చులిస్తామని ఓటర్లను కోరుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ఓటర్లు లక్షలమంది ఉన్నారు. వారి ఓట్లు కూడా కీలకం కావడంతో ఎలాగైనా అక్కడికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఏపీలో ఓటేయాల్సిందే అనుకుంటున్న కొందరు ఓటర్లు జీపులు, కార్లు లాంటి ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
రైళ్లు ఫుల్.. ఆర్టీసీ ఎక్స్‌ట్రా బస్సులు
హైదరాబాద్ నుంచి ఏపీలోని నగరాలు, ముఖ్య పట్టణాలకు ఏపీఎస్ఆర్టీసీ నిత్యం 350 బస్సులు నడుపుతోంది. ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఈ నెల 9, 10, 11,12 తేదీలకు కలిపి మరో 500 బస్సులు అదనంగా నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమవుతోంది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా ఏపీకి అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్, వరంగల్ మీదుగా ఏపీ వైపునకు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పుడో అయిపోయాయి. రద్దీ, ఎండ వేడిమికి జనరల్ బోగీల్లో వెళ్లడానికి ఏపీ ఓటర్లు జంకుతున్నారు.
ఎండ దెబ్బ
ఈసారి ఎండలు హైదరాబాద్‌లో కూడా దంచి కొడుతున్నాయి. ఇక 9 కోస్తా జిల్లాల్లో, 4 రాయలసీమ జిల్లాల్లోనూ భానుడు అంతకు మించి భగభగలాడిపోతున్నాడు. తెలంగాణలో కూడా చాలామందికి ఓటు ఉండటంతో ఇంత ఎండలో ఏపీకి వెళ్లి ఓటేయాలా అని చాలామంది ఆలోచనల్లో పడ్డారు. అంతగా వెళ్లాలనుకుంటే పిల్లల్ని వదిలేసి, ఓటున్న పెద్దలే వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు.