అవి దుష్ప్రవచనాలు.. గరికపాటిపై బీఎస్పీ నేతల ఆగ్రహం

అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గరికపాటిపై ఫిర్యాదు చేశారు బీఎస్పీ నేతలు. మనువాదానికి నిలువెత్తు నిదర్శనం గరికపాటి అని, ఆయనవి ప్రవచనాలు కాదని, దుష్ప్రవచనాలని అన్నారు.

Advertisement
Update:2022-11-20 09:37 IST

చాన్నాళ్లుగా తన ప్రవచనాలతో అందరి ప్రశంసలు అందుకున్న గరికపాటి నరసింహారావు ఇప్పుడు వివాదాలతో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన ప్రవచనాలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. పాత వీడియోలన్నీ బయటకు తీసి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆయన మాయావతి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా హైలెట్ అవుతున్నాయి. మాయావతిపై గరికపాటి వ్యాఖ్యలను బీఎస్పీ ఏపీ నేతలు ఖండించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గరికపాటిపై ఫిర్యాదు చేశారు. మనువాదానికి నిలువెత్తు నిదర్శనం గరికపాటి అని, ఆయనవి ప్రవచనాలు కాదని, దుష్ప్రవచనాలని అన్నారు. ఫాసిస్ట్ భావాలతో కుల దురహంకారంతో బీసీలు, ఎస్సీలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

గరికపాటి అసలేమన్నారు..?

మాయావతి గురించి గరికపాటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆమె రూపాన్ని కూడా గరికపాటి హేళన చేసేలా మాట్లాడారు. యూపీ నిండా ఆమె విగ్రహాలు పెట్టుకుంటున్నారని, ఏనుగు విగ్రహం, దానితోపాటు మాయావతి విగ్రహం కూడా పెడుతున్నారని చెప్పిన గరికపాటి, రెండు విగ్రహాలెందుకు ఏదో ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని సెటైర్లు వేశారు. మాయావతి ఉండగా ఇక ఏనుగు విగ్రహం ఎందుకన్నారు. ఈ వ్యాఖ్యలు బహిరంగ వేదికపై చేసినట్టే ఉన్నా.. ఏ సందర్భంలో ఆయన ఈ కామెంట్లు చేశారో స్పష్టంగా తెలియదు. కానీ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.

వరుస వివాదాలు..

గరికపాటికి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. చిరంజీవి సెల్ఫీల విషయంలో ఆయన రచ్చ చేసిన తర్వాత, వరుసగా ఆయనపై నెగెటివ్ కామెంట్లు పడుతున్నాయి. పాత వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. గరికపాటిని కాస్త గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ఆమధ్య రామ్ గోపాల్ వర్మ కూడా గరికపాటిని ట్విట్టర్లో ఓ ఆట ఆడేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మాయావతిపై చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో బీఎస్పీ నేతలు మండిపడుతున్నారు. మాయావతిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహంతో ఉన్నాయి. మొత్తమ్మీద గరికపాటి మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు.

Tags:    
Advertisement

Similar News