ఏపీలో 175 నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్‌ పోటీ : తోట చంద్రశేఖర్‌

చంద్రశేఖర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ మరింత ఊపందుకుంటోందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే ఒరవడి కొనసాగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

Advertisement
Update:2023-02-23 06:58 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి భారత రాష్ట్ర సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు. రైతులు, యువత, మహిళలకు సంబంధించిన సమస్యలే పార్టీ ప్రాథమిక ఎజెండా అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రైతులు, యువత అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సత్వర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అభివృద్ధి నమూనాను అమలు చేస్తామని ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్‌ క్యాడర్‌తో కలిసి విజయవాడలో బుధవారం ర్యాలీ నిర్వహించిన ఆయన‌ బందర్‌రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ మరింత ఊపందుకుంటోందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే ఒరవడి కొనసాగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. విభజన జరిగి దాదాపు తొమ్మిదేళ్లయినా రాష్ట్ర రాజధాని కూడా లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆయన ఎత్తిచూపారు.

“ఏపీలో BRS అధికారంలోకి వస్తే, మూడు నుండి నాలుగు సంవత్సరాలలో రాష్ట్ర రాజధానిని నిర్మిస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడప స్టీల్‌ ప్లాంట్‌, వైజాగ్‌ రైల్వే జోన్‌, దుగ్గరాజపట్నం ఓడరేవు ఏర్పాటు చేయడంతోపాటు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద హామీ ఇచ్చిన ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం’’ అని తెలిపారు చంద్రశేఖర్.

కాంగ్రెస్‌ ఇప్పుడు శక్తి విహీనం అయిపోయిందని, బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి ఆ పార్టీకి లేదని అన్నారు. అందుకే, బీఆర్‌ఎస్‌ ‘అబ్‌కీ బార్‌, కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో నిరుపేదలకు అవసరమైన గొంతుకను అందించిందని ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News