జగన్ కి థ్యాంక్స్.. టీడీపీపై నో కామెంట్

విశాఖ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు బొత్స. ఎమ్మెల్సీగా ఆయన మూడేళ్లు పదవిలో ఉంటారు.

Advertisement
Update: 2024-08-16 13:15 GMT

విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు బీఫామ్ ఇచ్చి.. గెలిపించిన వైసీపీ అధినేత జగన్ కి కృతజ్ఞతలు అని చెప్పారు బొత్స సత్యనారాయణ. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి ఆయన ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని చెప్పారాయన. ఇదే విధంగా ఒకే మాటపై నిలబడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు బొత్స.


ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. చివరకు ఇండిపెండెంట్ గా ఉన్న ఒకే ఒక అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బొత్స విజయం ఏకగ్రీవమైంది. టీడీపీ తోకముడిచిందని, బలం లేక వెనక్కి వెళ్లిపోయిందని, ఓట్లు కొనాలని ప్రయత్నించి విఫలమైందని.. వైసీపీ కామెంట్లు చేస్తోంది. అయితే బొత్స మాత్రం టీడీపీ పోటీపై స్పందించలేదు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారాయన. అందరి కృషి వల్లే తన ఏకగ్రీవ విజయం సాధ్యమైందన్నారు బొత్స.

పదవిలో మూడేళ్లు..

విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఈ ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికగా దీన్ని భావించాలి. వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుందని చెప్పాలి. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్‌ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. పార్టీ ఫిరాయింపుకి పాల్పడ్డారని వైసీపీ చేసిన ఫిర్యాదుతో మండలి చైర్మన్ శ్రీనివాస్ పై అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్సీ పదవి పోయినా తాజా ఎన్నికల్లో ఆయన విశాఖ సౌత్ నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల పదవీకాలం కోసం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవ విజయం సాధించారు. 

Tags:    
Advertisement

Similar News