బాబు, పవన్ భేటీ.. తేలు కుట్టిన దొంగలా బీజేపీ
చంద్రబాబుతో వెళ్తే పవన్ కల్యాణ్ సీఎం కాలేరని టీవీ చర్చల్లో సెలవిచ్చారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. పోనీ పవన్ కల్యాణ్ బీజేపీతో వస్తే ఆయన సీఎం కాగలరా అంటే దానికి గ్యారెంటీ ఏముంది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ వల్ల ఎవరి మైలేజీ పెరిగిందో, ఎవరి మైలేజీ తగ్గిందో ఇప్పుడే చెప్పలేం కానీ, మధ్యలో బీజేపీకి మాత్రం ఇది మింగుడు పడని వ్యవహారంలా మారింది. మేమింకా కలిసే ఉన్నాం అని బీజేపీ చెప్పుకుంటున్నా.. పవన్ కల్యాణ్ ఇలా చంద్రబాబుని కలవడం కమలదళానికి షాకింగ్ న్యూసే. దీనిపై స్పందించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కుప్పంలో చంద్రబాబుని పోలీసులు అడ్డుకోవాడన్ని ఖండిస్తున్నానని, ఆయనకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానన్నారు పవన్. జీవో నెంబర్-1 రద్దుకోసం ప్రతిపక్షాలంతా కలసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీతో కూడా మాట్లాడతానన్నారు. జీవోకి తాము కూడా వ్యతిరేకం అంటున్న బీజేపీ.. కందుకూరు, గుంటూరు ఘటనలకు మాత్రం చంద్రబాబే కారణం అంటోంది. ఆయన వల్లే తొక్కిసలాట, మరణాలు జరిగాయని విమర్శించింది. కానీ పవన్ మాత్రం ఆ దుర్ఘటనలపై మాట్లాడలేదు, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించారు. ఇక్కడే బీజేపీ, జనసేన మధ్య చిన్న లాజిక్ మిస్ అవుతోంది. అందరం కలిసే పోరాటం చేస్తామంటారు పవన్, చంద్రబాబు లేకుండా రావాలంటోంది బీజేపీ.
బాబుతో వెళ్తే పవన్ సీఎం కాలేరు..
చంద్రబాబుతో వెళ్తే పవన్ కల్యాణ్ సీఎం కాలేరని టీవీ చర్చల్లో సెలవిచ్చారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. పోనీ పవన్ కల్యాణ్ బీజేపీతో వస్తే అయినా ఆయన సీఎం కాగలరా అంటే దానికి గ్యారెంటీ ఏముంది, అసలు జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవరికుంది..? అయితే పవన్, చంద్రబాబుని కలవడం మాత్రం బీజేపీకి ఇష్టంలేదు. అలాగని వారు అడ్డుకోనూ లేరు. ఆమధ్య పవన్ కల్యాణ్ కి విశాఖలో మోదీ హితబోధ చేశారని అనుకున్నా, దాని ప్రభావం ఇదేనా అనే అనుమానం రాకమానదు. అంటే పవన్ చంద్రబాబుతో కలసి వెళ్లాలనుకుంటే మాత్రం బీజేపీని పూర్తిగా లైట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు, ఇక జ్ఞానోదయం కావాల్సింది బీజేపీకి నేతలకు మాత్రమే.