కన్నా వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితం.. బీజేపీ అధిష్టానం ఆగ్రహం

తమ పార్టీని వదిలి కన్నా వెళ్లిపోవడం, పార్టీపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్టు చెబుతున్నారు నేతలు. బీజేపీని దెబ్బతీయడానికి చేసిన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా వాటిని అభివర్ణించారు, కన్నా వ్యాఖ్యలను ఖండించారు.

Advertisement
Update:2023-02-16 20:09 IST

పార్టీని వీడే క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు కన్నా లక్ష్మీనారాయణ. గతంలో కూడా ఆయన ఇవే ఆరోపణలు చేసినా ఈసారి కాస్త డోసు పెంచారు. వీర్రాజుతోపాటు, స్థానిక నాయకుల ప్రవర్తన నచ్చకే తాను పార్టీని వీడుతున్నానన్నారు. కన్నా ఆరోపణలను పార్టీ ఖండించింది. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర శాఖ కన్నా విషయంలో తమ స్పందన తెలియజేసింది. కన్నా లక్ష్మీ నారాయణకు ఆయన రాజకీయ స్థాయికి అనుగుణంగా బీజేపీ గౌరవం ఇచ్చిందని, పదవులు కూడా ఇచ్చామని తెలిపింది.

రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు..

ఏపీలో బీజేపీకి ప్రజాభిమానం, ప్రజా మద్దతు లభిస్తున్న తరుణంలో తమ పార్టీని వదిలి కన్నా వెళ్లిపోవడం, పార్టీపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్టు చెబుతున్నారు పార్టీ నేతలు. బీజేపీని దెబ్బతీయడానికి చేసిన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా వాటిని అభివర్ణించారు, కన్నా వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర బీజేపీ ఏకపక్ష నిర్ణయాలేవీ తీసుకోలేదని, సంస్థాగత నిర్ణయాలన్నీ పార్టీ అధిష్టానం సమ్మతితోనే జరిగాయని అంటున్నారు. సోము వీర్రాజు నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని చెబుతున్నారు.

జీవీఎల్ స్పందన ఏంటంటే..?

కన్నా లక్ష్మీ నారాయణకు బీజేపీ సముచిత స్థానం ఇచ్చిందని అన్నారు రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. బీజేపీ అధ్యక్షుడిగా.. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పదవులిచ్చిందని చెప్పారు. సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదన్నారు ఎంపీ జీవీఎల్. బయట పార్టీ నుంచి వచ్చిన వారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని.. అలాంటిది పక్క పార్టీనుంచి వచ్చిన కన్నాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేశామని, ఆ విషయాన్ని మరచిపోవద్దన్నారు. తనపై కన్నా చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు స్పందించబోనని చెప్పారు జీవీఎల్.

Tags:    
Advertisement

Similar News