వచ్చింది రాయబారానికేనా ?

తాజా వివాదానికి ముగింపు పలికేందుకు బీజేపీ అగ్రనేతలు దియోధర్‌కే బాధ్యత అప్పగించారట. మరి బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ చెబితే పవన్ వింటారా?

Advertisement
Update:2022-10-20 11:25 IST

బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ హ‌ఠాత్తుగా విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. దియోధర్ రెగ్యులర్‌గా రాష్ట్రానికి వస్తుంటారు కానీ ఇప్పుడు విజయవాడలో కనిపించటమే ఆశ్చర్యంగా ఉంది. గడచిన నాలుగురోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రంగా తిరుగుతున్న రాజకీయాల్లో దియోధర్ తన పాత్ర పోషించటానికే వచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఆయన పోషించబోయే పాత్ర ఏమిటంటే రాయబారం. అవును బీజేపీ-పవన్ మధ్య రాయబారం చేయటానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు రోజుల క్రితం పవన్ పార్టీ మీటింగులో మాట్లాడుతూ.. బీజేపీ వైఖరిపై విసుగొచ్చేసినట్లు చెప్పారు. రోడ్డు మ్యాప్ ఇవ్వమంటే బీజేపీ ఇవ్వటం లేదని అందుకే తన నిర్ణయాన్ని తీసేసుకున్నట్లు ప్రకటించారు. అలా ప్రకటించిన కాసేపటికే పవన్, చంద్రబాబు నాయుడు మధ్య మీటింగ్ జరిగింది. దీంతో బీజేపీలో కలకలం మొదలైంది. ఈ విషయం ఇలాగుంటే మరుసటి రోజు సీనియర్ నేత, బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ చీఫ్ సోమువీర్రాజు వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దియోధర్ విజయవాడలో ల్యాండ్ అయ్యారని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంది ఇన్‌చార్జి మాత్రమే. పవన్ ఢిల్లీ నేతల్లో ఎవరితో అయినా మాట్లాడుతున్నారంటే అది దియోధర్ తోనే. మూడున్నరేళ్ళుగా నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్ కోసం పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. ఢిల్లీకి పవన్ ఎప్పుడెళ్ళినా దియోధర్‌ను మాత్రమే కలిసొచ్చేస్తున్నారు.

కాబట్టి తాజా వివాదానికి ముగింపు పలికేందుకు బీజేపీ అగ్రనేతలు దియోధర్‌కే బాధ్యత అప్పగించారట. మరి దియోధర్ చెబితే పవన్ వింటారా? బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు పవన్ ప్రకటించలేదు. అయితే చంద్రబాబుతో భేటీ అయ్యారంటే అర్ధమిదే. గడచిన ఐదేళ్ళుగా చంద్రబాబు-పవన్ ఎక్కడా కలవలేదు. అలాంటిది బీజేపీపైన అసంతృప్తి వ్యక్తం చేసిన కాసేపటికే చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారంటేనే ఆయన ఉద్దేశం అర్ధమైపోతోంది. మరి దియోధర్ తన రాయబారంలో సక్సెస్ అవుతారా? అన్నది ఆసక్తిగా మారింది. పవన్‌తో ఫోన్లో మాట్లాడుతారా? లేకపోతే డైరెక్ట్‌గా కలుస్తారా అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News