కోడి కత్తి మిస్సింగ్?

దాడికి ఉపయోగించిన ప్రైమ్ ఆబ్జెక్ట్ కోడి కత్తి లేకపోతే విచారణ ఎలా చేయాలనే విషయమై జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో మిస్సయిన వస్తువులతో పాటు కోడి కత్తిని కూడా వచ్చే విచారణ సందర్భంగా కోర్టు ముందుంచాలని గట్టిగా ఆదేశించారు. ఈనెల 14వ తేదీకి కేసును వాయిదా వేశారు.

Advertisement
Update:2023-03-08 11:40 IST

దాదాపు ఐదేళ్ళక్రిందట ఎంతో సంచలనం సృష్టించిన జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో కోడి కత్తి మిస్సయింది. ప్రతిపక్షంలో ఉన్న‌ప్పుడు జగన్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా వైజాగ్ విమానాశ్రయానికి చేరుకున్న‌ప్పుడు ఆయనపై విమానాశ్రయం లాంజ్‌లో దాడి జరిగింది. శ్రీనివాసరావు అనే కుర్రాడు కోడి కత్తితో జగన్‌పై దాడి చేశాడు. ఆ దాడిలో గొంతులో దిగాల్సిన కత్తి భుజంలో దిగటంతో జగన్‌కు ప్రాణాపాయం తప్పింది. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆయుధం మిస్సయ్యింది. జగన్‌పై దాడి కేసును నమోదు చేసుకుని విచారిస్తున్నది ఎన్ఐఏ ఉన్నతాధికారులు. విమానాశ్రయంలో జరిగిన దాడి కాబట్టి సీఐఎస్ఎఫ్ కేసు నమోదు చేసి దాని విచారణ బాధ్యతను ఎన్ఐఏకి అప్పగించింది. ఇందులో భాగంగానే విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణకు దాడి చేసిన శ్రీనివాసరావుతో పాటు కేసు నమోదు చేసిన అధికారులు, విచారిస్తున్న అధికారులు, విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ అంతా హాజరయ్యారు.

దాడి సందర్భంగా అప్పట్లో ఎన్ఐఏ సేకరించిన కోడి కత్తి, జగన్ చొక్కా, నిందితుడి పర్సు, బెల్టు, సెల్ ఫోన్, పెన్ను తదితరాలన్ని ఉంచిన బ్యాగును ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టింది. విచారణ సందర్భంగా వస్తువులను గుర్తించేందుకు జడ్జి వాటిని బయటకు తీయమని ఆదేశించారు. బ్యాగును ఓపెన్ చేసిన‌ప్పుడు జగన్ చొక్కా తప్ప ఇంకే వస్తువులు కనబడలేదు. అంటే మిగిలిన వస్తువులతో పాటు కోడి కత్తి కూడా మిస్సయినట్లు జడ్జి గుర్తించారు.

దాడికి ఉపయోగించిన ప్రైమ్ ఆబ్జెక్ట్ కోడి కత్తి లేకపోతే విచారణ ఎలా చేయాలనే విషయమై జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో మిస్సయిన వస్తువులతో పాటు కోడి కత్తిని కూడా వచ్చే విచారణ సందర్భంగా కోర్టు ముందుంచాలని గట్టిగా ఆదేశించారు. ఈనెల 14వ తేదీకి కేసును వాయిదా వేశారు. సాక్ష్యాలన్నింటినీ దాచిన బ్యాగులో ఒక్క చొక్కా మినహా మిగిలిన వస్తులు అందులోను కీలకమైన కోడి కత్తి ఎలా మిస్సయ్యిందో ఎవరికీ అర్థం కావటంలేదు. కోర్టు విచారణకు వచ్చేముందు ప్రవేశపెట్టాల్సిన సాక్ష్యాలన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన ప్రాథ‌మిక బాధ్యత దర్యాప్తు అధికారులదే. మరిప్పుడు మిస్సయిన కోడి కత్తి విషయంలో ఎన్ఐఏ ఏ సమాధానం చెబుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News