కుప్పంలో బాబుకు మరో షాక్.. 200 మంది తెలుగు తమ్ముళ్ల గుడ్ బై

శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది వైసీపీలో చేరారు. టీడీపీ సభ్యత్వం పొందిన గుర్తింపు కార్డులు చేతపట్టుకుని ఎమ్మెల్సీ భరత్‌ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

Advertisement
Update:2022-09-13 17:04 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ పరిస్థితి నిద్రలేకుండా చేస్తోంది. అక్కడ ఏ రోజు ఏం జరుగుతుందో అని ఆయన టెన్షన్ పడుతున్నారు. అందుకు కారణం వైఎస్ జగన్ కుప్పం సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడమే. చంద్రబాబు నాయుడును సొంత నియోజకవర్గంలో దెబ్బతీయాలన్న ప్లాన్‌తో సీఎం జగన్ గట్టిగా ప్లాన్ వేశారు.

అక్కడ టీడీపీని బలహీనపరిచి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలోపేతం చేయాలని.. సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబును ఓడించాలని జగన్ స్కెచ్ వేశారు. ఈ బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీని గట్టి దెబ్బకొట్టారు. ఆందోళన చెందిన చంద్రబాబు కుప్పం రావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఈ నియోజకవర్గంలోనే మకాం వేసి .. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు చేజారిపోకుండా చూస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. ఎప్పటికప్పుడు కుప్పంలో ఏదో ఒక రాజకీయ పరిణామం ఆయనను కలవరపెడుతోంది.

తాజాగా శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది వైసీపీలో చేరారు. టీడీపీ సభ్యత్వం పొందిన గుర్తింపు కార్డులు చేతపట్టుకుని ఎమ్మెల్సీ భరత్‌ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఇలా వరుసగా నేతలు, కార్యకర్తలు పార్టీని వీడటం టీడీపీకి గట్టి దెబ్బేనని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారని సమాచారం. మరోవైపు త్వరలో ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News