సీమలో టీడీపీకి బిగ్‌షాక్.. వైసీపీలో చేరనున్న కేఈ..!
కర్నూలు జిల్లాలో డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి చంద్రబాబు అవకాశం కల్పిస్తారని.. కేఈ ప్రభాకర్ ఆశలు పెట్టుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాయలసీయలో టీడీపీకి బిగ్‌షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత కేఈ ప్రభాకర్ పార్టీకి గుడ్‌బై ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న కేఈ.. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదనలో ఉన్నారు కేఈ.
కర్నూలు జిల్లాలో డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి చంద్రబాబు అవకాశం కల్పిస్తారని.. కేఈ ప్రభాకర్ ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరకు కేఈ ప్రభాకర్‌ను పక్కనపెట్టేసిన చంద్రబాబు.. డోన్ స్థానంలో మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరును ఫైనల్ చేశారు. ఇక పత్తికొండ సీటును కేఈ కృష్ణమూర్తి కుమారుడికి కేటాయించిన చంద్రబాబు.. ప్రభాకర్‌కు మొండిచేయి చూపించారు.
టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రభాకర్.. టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అనుచరులతో సమావేశం నిర్వహించి రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్యనేతలతో ఆయన టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.