నెల్లూరు తర్వాత నంద్యాల.. వైసీపీలో రసవత్తర రాజకీయం
భూమా అఖిల ప్రియ స్టేట్ మెంట్ తో ఎమ్మెల్యే శిల్పా రవి ఇరుకున పడ్డారు. అఖిల ప్రియ స్టేట్ మెంట్ తో తనకేం సంబంధం అంటున్నారాయన. తాను టీడీపీలోకి వెళ్లడంలేదని, అసలా ప్రస్తావనే లేదని చెబుతున్నారు.
సీఎం జగన్ 175 అసెంబ్లీ స్థానాలకు 175 స్థానాల్లో గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. కానీ వైసీపీకి ఉన్న 151మందిలో ఒక్కొక్కరే పార్టీకి షాకిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లానుంచి ఇద్దరు పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. పోతూ పోతూ ఫోన్ ట్యాపింగ్ అనే నిందను పార్టీపై మోపారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో కూడా పార్టీ మారేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారా..? అదే నిజమైతే నంద్యాలలో పడే తొలి వికెట్ ఎవరిది..? ఈ ప్రచారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
బాంబు పేల్చిన అఖిల ప్రియ..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి శిల్పా వర్గానికి మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భూమా కుటుంబం టీడీపీలో ఉంది, శిల్పా వర్గం వైసీపీలో ఉంది. నంద్యాలలో శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన త్వరలో టీడీపీలో చేరతారంటూ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో వైసీపీలో అనుమానాలు మొదలయ్యాయి.
నెల్లూరులో ఆనం కానీ, కోటంరెడ్డి కానీ పార్టీ మారతారంటూ టీడీపీ నేతలెవరూ ముందుగా హింటివ్వలేదు, వారికి వారే బయటపడ్డారు. అది కూడా ఇంకా అధికారికం కాదు. కానీ నంద్యాల జిల్లాలో మాత్రం ఎమ్మెల్యే శిల్పా రవి టీడీపీలోకి వస్తారంటున్నారు ఆ పార్టీ నేత భూమా అఖిల ప్రియ. తమ పార్టీలోకి రావాలనుకుంటున్నవారు తమ అధినాయకత్వాన్ని ఇంకా ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారామె. వైసీపీలో శిల్పా కుటుంబ పరిస్థితి బాగాలేదని, పార్టీతో బంధం చెడిందని భూమా అఖిల మీడియా ముందు చెప్పారు. ఇప్పటికే టీడీపీ నేతలతో శిల్పా ఫ్యామిలీ టచ్ లో ఉందని అన్నారు.
ఇరుకునపడ్డ ఎమ్మెల్యే..
భూమా అఖిల ప్రియ స్టేట్ మెంట్ తో ఎమ్మెల్యే శిల్పా రవి ఇరుకున పడ్డారు. అఖిల ప్రియ స్టేట్ మెంట్ తో తనకేం సంబంధం అంటున్నారాయన. తాను టీడీపీలోకి వెళ్లడంలేదని, అసలా ప్రస్తావనే లేదని చెబుతున్నారు. కానీ వైసీపీనుంచి గుసగుసలు వినపడుతున్నాయి. కావాలనే భూమా అఖిల ప్రియ, శిల్పా ఫ్యామిలీపై నిందలు మోపారా..? లేక నిజంగానే టీడీపీతో శిల్పా కుటుంబం చర్చలు జరిపిందా..? అనేది తేలాల్సి ఉంది. ఈలోగా అఖిలప్రియ బహిరంగ చర్చకు సవాళ్లు విసరడంతో ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాలలో గాంధీ చౌక్ సెంటర్లో బహిరంగ చర్చకు రావాలంటూ శిల్పా కుటుంబానికి అఖిల ప్రియ సవాల్ విసిరారు, దీంతో పోలీసులు ఆమెకు నోటీసులిచ్చారు.