ఎంపీ అభ్యర్థులుగా బీసీలు.. చంద్రబాబుకు షాకివ్వబోతున్న జగన్
ఏలూరు, నరసరావుపేట, విశాఖపట్నం ఇలా అగ్రవర్ణాలు ముఖ్యంగా కమ్మ సామాజికవర్గమే అత్యధికంగా గెలిచే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈసారి బీసీలను నిలపాలని జగన్ ఫిక్సయిపోయారు.
తమ పార్టీ బీసీలకు రాజకీయ జన్మనిచ్చిందని డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో గట్టి షాక్ ఇవ్వడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వైసీపీ అధినేత కూడా బీసీ మంత్రాన్నే వాడుతుండటం ఇక్కడ విశేషం. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గమే ఎక్కువసార్లు పోటీపడి, గెలుచుకున్న పార్లమెంటు నియోజకవర్గాల్లో చరిత్ర తిరగరాసేందుకు జగన్ పక్కా ప్రణాళికలతో ముందుకెళుతున్నారు.
ఏలూరుతో మొదలుపెట్టారు
ఏలూరు, నరసరావుపేట, విశాఖపట్నం ఇలా అగ్రవర్ణాలు ముఖ్యంగా కమ్మ సామాజికవర్గమే అత్యధికంగా గెలిచే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈసారి బీసీలను నిలపాలని జగన్ ఫిక్సయిపోయారు. 1957 నుంచి 2014 వరకు ఒక్కసారి కూడా ఇక్కడి నుంచి కమ్మవారు తప్ప వేరేవారు ఎంపీగా గెలిచింది లేదు. 2019లో తొలిసారిగా వెలమ సామాజికవర్గం నుంచి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు శ్రీధర్‌ను బరిలోకి దింపి అక్కడ కమ్మవారి విజయపరంపరకు జగన్ అడ్డుకట్ట వేశారు. ఈసారి అక్కడ బీసీల నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.
విశాఖలోనూ అదే ప్లాన్
1999 నుంచి 2019 వరకు 5సార్లు జరిగిన ఎంపీ ఎన్నికల్లో నాలుగుసార్లు కమ్మవారే గెలిచారు. ఇందులో టీడీపీ నుంచి ఎంవీఎస్ (గీతం) మూర్తి, కాంగ్రెస్ నుంచి పురందేశ్వరి, బీజేపీ నుంచి కంభంపాటి హరిబాబు, వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఈసారి దీన్ని బీసీల అడ్డాగా మార్చాలని డిసైడయిన జగన్ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మిని అభ్యర్థిగా నిలపనున్నట్లు ప్రకటించారు.
నరసరావుపేటలోనూ బీసీ మంత్రమే
మరోవైపు అత్యధికసార్లు రెడ్లు, తర్వాత కమ్మవారు ఎంపీలుగా గెలుస్తూ వచ్చిన నరసరావుపేట నియోజకవర్గాన్ని ఈసారి బీసీల అడ్డాగా మార్చాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇక్కడ సిటింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. అందుకు అంగీకరించని ఎంపీ ఏకంగా పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. అయినా తగ్గని జగన్ ఇక్కడి నుంచి మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌ను రంగంలోకి దింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అనిల్‌ను పిలిచి, ఈ విషయం చెప్పేశారు కూడా. మొత్తంగా జగన్ బీసీ వ్యూహం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి మరి.