ఏపీలో నకిలీ లాయర్లు..

15 మందిలో 8 మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి తాము ఫేక్ లాయర్లమని అంగీకరించడంతో పాటు.. ఎన్‌రోల్‌మెంట్‌ను సరెండర్‌ చేసి న్యాయవాదిగా తమ పేరును ఉపసంహరించుకున్నారు.

Advertisement
Update:2023-01-21 08:29 IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్లపాటు లాయర్లుగా న్యాయస్థానాల్లో వాదిస్తున్న నకిలీ లాయ‌ర్ల‌ వ్యవహారం బయటపడింది. రాష్ట్రంలో మొత్తం 15 మంది నకిలీ లాయర్లు వివిధ కోర్టుల్లో ప్రాక్టిస్ చేస్తున్నట్టు బార్‌ కౌన్సిల్ గుర్తించింది. వీరంతా నకిలీ సర్టిఫికెట్లతో లాయర్లుగా చేరారు. 15 మందిలో ఏడుగురు 11 ఏళ్లుగా దిగువ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా.. సంబంధిత లా కాలేజీలకు, యూనివర్శిటీలకు వీరి వివరాలను బార్ కౌన్సిల్ పంపగా అసలు వారు న్యాయవిద్య చదవలేదని తేలింది. వారు సమర్పించినవి నకిలీ సర్టిఫికెట్లని తేలింది.

దాంతో బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలత నకిలీ లాయర్లపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 15 మందిలో 8 మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి తాము ఫేక్ లాయర్లమని అంగీకరించడంతో పాటు.. ఎన్‌రోల్‌మెంట్‌ను సరెండర్‌ చేసి న్యాయవాదిగా తమ పేరును ఉపసంహరించుకున్నారు. మిగిలిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నకిలీ లాయర్లలో తునికి చెందిన చింతకాయల సీఎస్‌ఎన్ మూర్తి, తెనాలికి చెందిన డి. చాముండేశ్వరి, అనంతపురం నుంచి పురుషోత్తం, ఏపీ హైకోర్టులో ప్రాక్టిస్ చేస్తున్న రత్నకుమార్ ఉన్నారు. సత్తెనపల్లికి చెందిన నిక్కి నాగేశ్వరరావు, మాచర్ల వెంకటేశ్వరరావు, కాకినాడకు చెందిన కొత్తూరు శ్రీనివాస్ వరప్రసాద్‌ అనే నకిలీ లాయర్లపైనా కేసు నమోదు చేశారు.

పలు యూనివర్శిటీల్లో లా చదివినట్టు వీరంతా బార్ కౌన్సిల్‌కు సర్టిఫికెట్లు అందజేశారు. వాటిని ఆయా వర్శిటీలకు పంపగా వారెవరూ అక్కడ చదవలేదని నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు కూడా ఆయా వర్శిటీలకు లేఖలు రాశారు. వీరు చదివారా లేదా అన్న దానిపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తుళ్లూరు పోలీసులు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News