వాళ్లకు కాకాణి, వీళ్లకు జానీ మాస్టర్.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన హేమ

కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్నిపేర్లు నలిగిపోతున్నాయి. పోలీసులు అసలు వివరాలు చెప్పే వరకు వారంతా ఈ నిందలు భరించాల్సి రావడం దురదృష్టకరం.

Advertisement
Update:2024-05-20 16:02 IST

బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. 100మందికి పైగా తెలుగు వాళ్లు అక్కడ పట్టుబడ్డారని సమాచారం. ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్లు కూడా రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ వద్ద ఉన్నాయి. రేవ్ పార్టీలో ఉన్నారంటూ అతికొద్దిమంది పేర్లను మాత్రమే బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. కానీ సోషల్ మీడియా ఊరుకుంటుందా..? అసలే ఎన్నికల సీజన్. ఈ టైమ్ లో ఫేక్ న్యూస్ తో చెలరేగిపోతున్నాయి రాజకీయ పార్టీల అనుబంధ హ్యాండిళ్లు. ఈ టైమ్ లో రేవ్ పార్టీ అనగానే, ప్రత్యర్థి పార్టీలపై పుకార్లతో రెచ్చిపోతున్నారు కొందరు.

టీడీపీ టార్గెట్ కాకాణి..

రేవ్ పార్టీలో పట్టుబడిన కార్లలో ఒకదానిలో కాకాణి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే వార్త సంచలనంగా మారింది. స్టిక్కర్ ఉండొచ్చు కానీ, దాని గడువు తీరిపోయిందని, అసలా కారు తనది కాదని చెబుతున్నారు కాకాణి. అసలు వివరాలు అధికారికంగా బయటకు రాకముందే టీడీపీ.. కాకాణిపై తప్పుడు ట్వీట్లు వేస్తూ రెచ్చిపోతోంది. ఆయనపై బురదజల్లుతోంది.


వైసీపీ టార్గెట్ జానీ మాస్టర్..

రేవ్ పార్టీ నుంచి బయటకొస్తున్న వారి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో జానీ మాస్టర్ పోలికతో ఉన్న ఓ వ్యక్తిని వైసీపీ అనుకూల ట్విట్టర్ హ్యాండిళ్లు టార్గెట్ చేశాయి. జానీ మాస్టర్ నిన్న మొన్నటి వరకూ జనసేన తరపున ప్రచారం చేసి, ఇప్పుడిలా తన నిజ స్వరూపం బయటపెట్టారని వైసీపీకి చెందిన కొందరు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

హేమ ఇచ్చిన ట్విస్ట్..

రేవ్ పార్టీలో బెంగళూరు పోలీసులు నటి హేమ పేరు బయటపెట్టగానే.. ఆమె సడన్ గా తెరపైకి వచ్చారు. తాను హైదరాబాద్ లో చిల్ అవుతున్నానంటూ ఓ వీడియో బయటకు వదిలారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. అంతలోనే బెంగళూరు పోలీసులు నటి హేమ తాజా ఫొటోని కూడా రిలీజ్ చేసి ఆమెకు షాకిచ్చారు. దీంతో హేమ, మీడియాని తప్పుదోవ పట్టించారని అర్థమవుతోంది.

రెడ్ హ్యాండెడ్ గా దొరికినా.. తాము తప్పుచేయలేదని తప్పించుకుపోయే రోజులివి. అలాంటిది ఊహాగానాలకు ఎవరు మాత్రం ఎందుకు బదులిస్తారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్నిపేర్లు నలిగిపోతున్నాయి. పోలీసులు అసలు వివరాలు చెప్పే వరకు వారంతా ఈ నిందలు భరించాల్సి రావడం దురదృష్టకరం. 

Tags:    
Advertisement

Similar News