పొలిటికల్ బాంబ్ పేల్చిన బాలినేని..

పార్టీ తనకు సపోర్ట్ చేయలేదని, పార్టీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని అంటున్నారు బాలినేని. ప్రస్తుతానికి ఈవీఎంలపై పోరాటం చేస్తున్నానని, అది పూర్తయ్యాక అన్ని వివరాలు చెబుతానంటున్నారు.

Advertisement
Update:2024-08-27 17:54 IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వైసీపీని వీడి బయటకు వచ్చేస్తారా..? ఆయన మాటలు వింటే నిజమేనని అనిపిస్తుంది. తాను ఎక్కడ జనసేనలోకి వెళ్తానో అనే భయంతో కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారాయన. తాను జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇంతకీ జనసేనలోకి వెళ్లబోతున్నారా అనే ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానమివ్వలేదు బాలినేని.

ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు బాలినేని. ఈవీఎంల విషయంలో తాను చేస్తున్న న్యాయ పోరాటాన్ని పార్టీ పట్టించుకోవడం లేదని చెప్పారాయన. పార్టీకి చెబుదామన్నా ఎవరూ వినే పరిస్థితిల్లో లేరని, పార్టీ కోసం కష్టపడి పని చేసినా ఎవరూ తనవైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీ సపోర్ట్ చేయడం లేదన్నారు బాలినేని. ఒంగోలులో తాను కచ్చితంగా గెలిచేవాడినని, తన ఓటమిని కొందరు ప్రజలు కూడా నమ్మడం లేదన్నారు. ఈవీఎంల వెరిఫికేషన్ పై సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు వక్రీకరించి మాక్ పోలింగ్ చేస్తున్నారని, దానివల్ల ఉపయోగం ఏంటని నిలదీశారు బాలినేని.

తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనపై ప్రతిపక్షం అసత్య ఆరోపణలు చేసిందని.. ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారని, తనపై ఉన్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు బాలినేని. రాజకీయాల్లో తాను డబ్బులు పోగొట్టుకున్నానే కానీ సంపాదించిందేమీ లేదన్నారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో అసంతృప్తవాదిగా ముద్రపడ్డారు బాలినేని శ్రీనివాసులరెడ్డి. తాడేపల్లిలో చాలాసార్లు ఆయన్ను పార్టీ అధినేత జగన్ బుజ్జగించారు. చివరకు ఆయన పార్టీలోనే కొనసాగారు. అయితే ఎన్నికల తర్వాత కూడా బాలినేని వైఖరి మారలేదు. ఇప్పుడు కూడా వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనకు సపోర్ట్ చేయలేదని, పార్టీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని అంటున్నారు. ప్రస్తుతానికి ఈవీఎంలపై పోరాటం చేస్తున్నానని, అది పూర్తయ్యాక అన్ని వివరాలు చెబుతానంటున్నారు బాలినేని. 

Tags:    
Advertisement

Similar News