చెవిరెడ్డి ఎందుకు..? ఒంగోలు ఎంపీగా నేనే అంటున్న బాలినేని!

చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని ఒంగోలు ఎంపీ స్థానంలో పోటీకి దింపాల‌న్న‌ది జ‌గ‌న్ తాజా ఆలోచ‌న‌. ఆ ఉద్దేశంతోనే ఆయ‌న్ను ఇక్క‌డ జిల్లా ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు.

Advertisement
Update:2024-02-04 11:50 IST

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఎపిసోడ్ వైసీపీలో టీవీ సీరియ‌ల్‌లా సాగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు ఒంగోలు అసెంబ్లీ టికెట్ త‌న‌కు, ఎంపీ టికెట్ మాగుంట‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. మాగుంట‌కు ఎంపీ టికెట్ ఇవ్వ‌డానికి జ‌గ‌న్ స‌సేమిరా అన్నారు. దీంతో రూట్ మార్చి త‌న కొడుకు ప్ర‌ణీత్‌రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ అడిగారు. దానికీ వైసీపీ స్పందించ‌లేదు. ఇప్పుడు తానే ఒంగోలు ఎంపీగా నిల‌బెడ‌తాన‌ని తాడేప‌ల్లికి కొత్త ప్ర‌పోజ‌ల్ పంపారు.

చెవిరెడ్డిని ఎంపీ అభ్య‌ర్థి అంటున్న జ‌గ‌న్‌

చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని ఒంగోలు ఎంపీ స్థానంలో పోటీకి దింపాల‌న్న‌ది జ‌గ‌న్ తాజా ఆలోచ‌న‌. ఆ ఉద్దేశంతోనే ఆయ‌న్ను ఇక్క‌డ జిల్లా ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. దీంతో బాలినేని అలిగి హైద‌రాబాద్ వెళ్లిపోయినా అధిష్టానం పెద్ద‌గా స్పందించ‌లేదు. తిరిగివ‌చ్చిన బాలినేని ఎంపీ స్థానం ప‌రిధిలోని ఏ ఎమ్మెల్యే అడ‌గ‌న‌ప్పుడు త‌న‌కు మాత్రం ఎంపీ గెలుపుపై అంత ఆత్రం ఎందుకు, నా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తే చాలంటూ నిర్వేదంగా మాట్లాడారు

అంతలోనే మ‌ళ్లీ యాక్టివ్‌

గ‌తంలో ఎంపీ మాగుంట ఉన్నా ఆయ‌న జిల్లా రాజ‌కీయాల్లో వేలు పెట్టేవారు కాదు. అంతా బాలినేని హ‌వానే న‌డిచేది. మ‌రోవైపు జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ‌స్తూనే ఇక్క‌డ జేసీ, ఎస్పీల బ‌దిలీల్లో చెవిరెడ్డి చ‌క్రం తిప్పారు. ఈ నేప‌థ్యంలో చెవిరెడ్డిని అడ్డుకోక‌పోతే త‌న హ‌వా సాగ‌డం క‌ష్ట‌మ‌ని బాలినేని భావిస్తున్నారు. అందుకే చెవిరెడ్డి ఎందుకు..? తానే ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తాన‌ని అధిష్టానానికి స‌మాచారం పంపారు. దీనికి జ‌గ‌న్ స్పందన ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

Tags:    
Advertisement

Similar News