హాట్ టాపిక్ గా మారిన బాలయ్య, వైఎస్సార్ అనుబంధం..
అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం, కేసు మాఫీ కావడం, వైఎస్ఆర్ వల్లే ఆయన కేసు నుంచి బయటపడ్డారంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ ఇప్పుడు హైలెట్ అవుతోంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్ నడిచింది. చివరకు ఇప్పుడు బాలకృష్ణ కాల్పుల కేసు లైమ్ లైట్లోకి వస్తోంది. ఆనాడు వైఎస్సార్, బాలయ్యకు క్షమాభిక్ష పెట్టారని, లేకపోతే బాలకృష్ణ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.
చంద్రబాబు ఉంటే..
అప్పట్లో ఓ నిర్మాతపై తన ఇంట్లో బాలకృష్ణ జరిపిన కాల్పుల వ్యవహారం సంచలనంగా మారింది. ఆ తర్వాత కేసు మాఫీ అయింది. బాలకృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నారని, ప్రతివాదులు కూడా వెనక్కు తగ్గడంతో కేసు రద్దయిందనే ప్రచారం ఉంది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. బాలకృష్ణపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదని, అందుకే ఆయన బతికి బట్టకట్టారని అంటున్నారు వైసీపీ నేతలు. వైఎస్సార్ చలవతోనే ఆ కేసు మాఫీ అయిందని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంటే వైఎస్సార్ కి కూడా అభిమానమేనని చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో బాలకృష్ణ.. వైఎస్సార్ పై తీవ్రంగా స్పందించారని, ఆయన అభిమానుల్ని కుక్కలతో పోల్చడం సరికాదంటున్నారు వైసీపీ నేతలు. కాల్పుల ఘటన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉంటే, కచ్చితంగా బాలకృష్ణను కటకటాల వెనక్కు పంపించేవారని అన్నారు మాజీ మంత్రి అనిల్. తండ్రిపై చెప్పులేయించినప్పుడు లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోంది బాలయ్యా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.
బాలయ్యపై కోర్టుకెళ్తా..
ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదంటున్నారు ఎమ్మెల్సీ ఇక్బాల్. గతంలో ఇచ్చిన డాక్టర్ సర్టిఫికెట్ తర్వాత ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం, ఎమ్మెల్యేగా ఉండడంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు ఇక్బాల్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాట్లాడే హక్కు చంద్రబాబు, బాలకృష్ణకు లేదన్నారు. సినీ నిర్మాతను రివాల్వర్ తో కాల్చిన కేసులో ఆనాటి సీఎం రాజశేఖర రెడ్డి పుణ్యంతోనే బాలకృష్ణ కేసు నుంచి బయటపడ్డారని.. బాలకృష్ణ సినిమాలు, రాజకీయాల్లో ఉన్నాడంటే అది వైఎస్ఆర్ పుణ్యమే అన్నారు ఇక్బాల్. ఎమ్మెల్యే మతిస్థిమితం కోల్పోయినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని వెల్లడించారు.
మొత్తమ్మీద హెల్త్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారం బాలయ్య విషయంలో పాత కేసుని లైమ్ లైట్లోకి తెస్తోంది. అప్పట్లో ఆయన ఇంట్లో కాల్పుల వ్యవహారం, కేసు మాఫీ కావడం, వైఎస్ఆర్ వల్లే ఆయన కేసు నుంచి బయటపడ్డారంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.