హైదరాబాద్ కి అవినాష్ రెడ్డి, పక్కన చెవిరెడ్డి.. ఈరోజు కీలక పరిణామం?

తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత మరోసారి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది.మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణ మొదలవుతుంది. విచారణ పూర్తయిన తర్వాతే ఉత్కంఠకు తెరపడుతుంది.

Advertisement
Update:2023-04-17 09:02 IST

ఏపీ రాజకీయాలన్నీ ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ నేతలు ఒక్కొక్కరే అరెస్ట్ కావడం, ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరవుతుండటంతో అసలేం జరుగుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. సీబీఐ ఏకపక్షంగా అరెస్ట్ లు చేస్తోందంటూ తాజాగా అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన విచారణకు రావాలంటూ సీబీఐ తాఖీదులు పంపించింది. ఈరోజు పులివెందుల నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు. ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పలువురు నేతలు బలప్రదర్శనగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా..?

ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని కేవలం సాక్షిగానే సీబీఐ విచారణకు పిలిపించింది. ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మరోసారి విచారణకు పిలిచింది. భాస్కర్ రెడ్డి ని కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ లో అవినాష్‌ రెడ్డిని సహ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. హత్య తర్వాత సహనిందితులు డి.శివశంకర్‌ రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డితో కలిసి ఆధారాల్ని చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని అభియోగం మోపారు. దీంతో తొలిసారిగా అవినాష్‌రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్లు తేలిపోయింది. ఈ విచారణ తర్వాత అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణ మొదలవుతుంది. విచారణ పూర్తయిన తర్వాతే ఈ ఉత్కంఠకు తెరపడుతుంది.

వైసీపీలో గందరగోళం..

వైసీపీ నేతలు ఈ వ్యవహారంపై స్పందించేందుకు వెనకాడుతున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్.. చట్టం తన పని తాను చేసుకు పోతోందంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. నిందితులెవరైనా చట్టం నుంచి తప్పించుకు పోలేరన్నారు. ఆ తర్వాత వెంటనే ప్లేటు ఫిరాయించారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అంటూ మరో స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆలోపే వ్యవహారం రచ్చగా మారింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకరకంగా భాస్కర్ రెడ్డి అరెస్ట్ ని ఆయన సమర్థించినట్టే మాట్లాడినా, వెంటనే తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ స్టేట్ మెంట్ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలెవరూ ఈ వ్యవహారంపై స్పందించేలా లేరు. 

Tags:    
Advertisement

Similar News