ఆ డాక్టర్ ఓ కేటుగాడు.. ఏపీ ప్రభుత్వాన్ని ఇలా మాయ చేశాడు..

ఏపీలో ఓ డాక్టర్ కృత్రిమ వేలిముద్రను సృష్టించి కొన్ని సంవత్సరాలుగా ఆస్పత్రికి డుమ్మా కొడుతున్నాడు. ఎట్టకేలకు ఈ వ్యవహారం బయటకు రావ‌డంతో మంత్రి విడదల రజిని స‌ద‌రు డాక్టర్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.

Advertisement
Update:2022-09-04 10:04 IST

ఆపరేషన్లతో వేలిముద్రలు మారుస్తున్న ఓ ముఠాను ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వేలిముద్రలు మార్చి అరబ్ దేశాలకు ఉద్యోగుల్ని పంపిస్తున్న ఆ ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు వారి టెక్నాలజీ చూసి షాకయ్యారు. అయితే అంతకంటే ఘనులు ఉన్నారనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇన్నాళ్లూ నేర పరిశోధనలో వేలిముద్రలే కీలకం అనుకుంటున్న పోలీస్ శాఖ కూడా ఇకపై ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిందే. అవును, ఏపీలో ఓ డాక్టర్ కృత్రిమ వేలిముద్రను సృష్టించి కొన్ని సంవత్సరాలుగా ఆస్పత్రికి డుమ్మా కొడుతున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో కృత్రిమ వేలిముద్రతో అటెండెన్స్‌ను కింది స్థాయి సిబ్బందితో వేయించి, ఆయన మాత్రం ప్రైవేట్ ఆస్పత్రిలో పేషెంట్లను చూస్తుంటాడు. ఎట్టకేలకు స్థానికులకు అనుమానం రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. చివరకు మంత్రి విడదల రజిని స‌ద‌రు డాక్టర్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.


అసలేంటి కథ..?

బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ భానుప్రకాష్. ఏడాదిగా విధులకు హాజరు కావడంలేదు. అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చి వెళ్లినా ఆయనకు మాత్రం ఫుల్ అటెండెన్స్ పడుతోంది. సంతకాలతో పనవుతుందా అంటే కాదు, వైద్య శాఖలో వేలిముద్రల ద్వారా అటెండెన్స్ తీసుకుంటున్నా కూడా ఆయనకు హాజరు మాత్రం మిస్ కావడంలేదు. ఈ రహస్యం ఏంటా అని ఆరా తీస్తే.. కృత్రిమ వేలిముద్రను సృష్టించిన ఆయన దానితో పనికానిచ్చేస్తున్నాడు. ఆరోగ్య కేంద్రంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులను తన వైపు తిప్పుకుని, వారికి మందు పార్టీలిచ్చి మంచి చేసుకున్న డాక్టర్ భానుప్రకాష్.. తన తరపున ఆ వేలిముద్ర ద్వారా ప్రతి రోజూ సిబ్బంది అటెండెన్స్ వేసేలా ప్రణాళిక రచించాడు. కింది స్థాయి సిబ్బంది లోపాయికారీగా సహకరించడంతో ఆయన ఆస్పత్రికి రాకుండానే జీతం తీసుకుంటున్నాడు. డాక్టర్ మాత్రం మార్టూరు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి హాజరవుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

అటెండెన్స్ ఇక్కడ, పని అక్కడ..

ఈ వ్యవహారం కొన్నాళ్లు గుట్టుగా సాగినా చివరకు గ్రామస్తులకు అనుమానం వచ్చింది. వారు మంత్రి విడదల రజినికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె ఆస్పత్రికి తనిఖీకి వచ్చారు. డాక్టర్ లేడు, కానీ అటెండెన్స్ పడింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కృత్రిమ వేలి ముద్రలతో అటెండెన్స్ వేస్తున్న డాక్టర్ భానుప్రకాష్‌ని వెంటనే సస్పెండ్ చేసిన మంత్రి, ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేవలం అటెండెన్స్ విషయంలోనే కాదు, అసాంఘిక అసభ్య కార్యకలాపాలలో కూడా మనోడు అందెవేసిన చేయి అని ఫిర్యాదులున్నాయి.

Tags:    
Advertisement

Similar News