టెక్కలి జనసేన కార్యాలయంపై దాడి.. మళ్లీ మొదలైన వేడి..

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జనసేన పార్టీ కార్యాలయంపై గతరాత్రి జరిగిన దాడి సంచలనంగా మారింది. తెల్లరేసరికల్లా పార్టీ ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసమైంది. సామాన్లు విరగ్గొట్టి కుప్పగా పోశారు.

Advertisement
Update:2022-10-22 09:30 IST

పవన్ కల్యాణ్ చెప్పు చూపించడం, ఆ తర్వాత సీఎం జగన్ మూడు పెళ్లిళ్ల గురించి మరింతగా రెట్టించడం.. అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయిందనుకుంటే పొరపాటే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఏపీలో పరిస్థితులు మారిపోయాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జనసేన పార్టీ కార్యాలయంపై గతరాత్రి జరిగిన దాడి సంచలనంగా మారింది. తెల్లరేసరికల్లా పార్టీ ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసమైంది. సామాన్లు విరగ్గొట్టి కుప్పగా పోశారు. ఉదయాన్నే ఆఫీస్ కి వచ్చినవారు అక్కడి పరిస్థితి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైసీపీపై ఆరోపణలు..

వైసీపీ శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డాయని జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్‌ ఛార్జి కిరణ్‌ కుమార్‌ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అనుచరులే దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు అందరూ అక్కడే ఉన్నామని, పార్టీ నాయకులు బయటకు వెళ్లిన తర్వాత పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు. అప్రజాస్వామిక విధానాలను ఖండించాలని కోరారు.

టీడీపీ, బీజేపీ పరామర్శలు..

జనసేన కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే టీడీపీ, బీజేపీ స్పందించాయి. టీడీపీ తరపున పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ దాడి ఘటనను ఖండిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. టీడీపీ, బీజేపీ స్థానిక నేతలు జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్ ఉండగానే పొలిటికల్ హీట్ పెరిగింది. ఓవైపు మూడు రాజధానుల అంశం, మరోవైపు.. వైసీపీ-జనసేన మధ్య మాటల తూటాలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఏకంగా పార్టీ ఆఫీస్ లనే టార్గెట్ చేయడం ఈ ఎపిసోడ్ లో మరో మలుపు.

Tags:    
Advertisement

Similar News