రాళ్లదాడి కేసులో అరెస్ట్ లు..! పోలీసుల వివరణ ఏంటంటే..?

ఇప్పటి వరకు తాము విచారించిన వారందరూ అనుమానితులే తప్ప వారిని నిందితులుగా భావించవద్దని చెప్పారు పోలీసులు. మీడియాలో వచ్చిన వార్తల్ని వారు నిర్థారించలేదు.

Advertisement
Update:2024-04-17 07:23 IST

విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన యువకుడు దొరికాడని నిన్నటి నుంచి మీడియాలో హడావిడి జరుగుతోంది. పోలీసులు మాత్రం ఈ వార్తల్ని కొట్టిపారేస్తున్నారు. తమ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ నిజం కాదని తేల్చి చెప్పారు. పోలీసుల అదుపులో మొత్తం ఐదుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని లోతుగా విచారించి ఆ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామంటున్నారు. మీడియాలో వచ్చిన వార్తల్ని మాత్రం పోలీసులు నిర్థారించడంలేదు.

పురోగతి..

విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని వడ్డెర కాలనీకి చెందిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారికోసం కుటుంబ సభ్యులు రోడ్లపైకి రావడాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తోంది. ఇక టీడీపీ మరింత రెచ్చిపోయింది. బీసీ బిడ్డల్ని బలిచేస్తున్నారంటూ నారా లోకేష్ సంబంధం లేకుండా రచ్చ చేస్తున్నారు. గతంలో కోడికత్తి కేసులో దళిత బిడ్డను జైలుపాలు చేసి బలిచేశారని, ఇప్పుడు బీసీలను టార్గెట్ చేశారంటూ కులాల ప్రస్తావన తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు లోకేష్. పోలీసుల అదుపులో ఉన్నవారు అమాయకులని, వారని అన్యాయంగా తీసుకెళ్లారంటూ ఎల్లో మీడియా సానుభూతి చూపించడం ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్..

పోలీసులు ఏం చెబుతున్నారంటే..?

ఆరు ప్రత్యేక బృందాలతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, రోడ్ షో జరిగినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్ లు, కాల్‌ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాల్లో విశ్లేషించారు. అజిత్‌ సింగ్‌ నగర్‌తోపాటు ఆ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కొంతమంది యువకుల గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు. వారిలో రాయి విసిరిన వాడిని ప్రధాన నిందితుడు కాగా, మిగతా వారు అతడికి సహకరించినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిర్థారించుకున్న తర్వాతే నిందితుడి వివరాలు ప్రకటిస్తామంటున్నారు. మీడియాలో వచ్చినవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. పోలీసుల తరపున అధికారిక ప్రకటన వచ్చే వరకు దేన్నీ నమ్మొద్దని కోరారు. ఇప్పటి వరకు తాము విచారించిన వారందరూ అనుమానితులే తప్ప వారిని నిందితులుగా భావించవద్దని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News