దర్జాగా విమానంలో వచ్చి ఏటీఎంలు దోచుకుంటున్న ముఠా..

ఆ బ్యాంకు ఏటీఎం లలోని టెక్నికల్ లోపాలను దొంగలు పసిగట్టారని, అందుకే సులభంగా ఆ ఏటీఎంలలో దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు.

Advertisement
Update:2022-12-14 05:15 IST

వైజాగ్ లో ఏటీఎం దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. వారంతా రాజస్థాన్ నుంచి వచ్చిన వారేనని గుర్తించారు. విచిత్రం ఏంటంటే.. ఆ నలుగురు సభ్యుల ముఠా ఫ్లైట్ లో వైజాగ్ వచ్చింది. దర్జాగా విమానంలో వచ్చి రెడీ మేడ్ దుస్తుల బిజినెస్ కోసం అంటూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేశారు ముఠా సభ్యులు. రాత్రి కాగానే తమ పనితనం చూపించారు. 9.49 లక్షల రూపాయలను కొట్టేశారు. తీరా రాజస్థాన్ తిరిగి వెళ్లే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఏటీఎం దొంగల ముఠా నాయకుడు పరారీలో ఉన్నాడు.

ఆ బ్యాంక్ ఏటీఎంలే టార్గెట్..

ఇప్పటి వరకూ ఏటీఎం మిషన్ ని పగలగొట్టాలని చూసినవాళ్లని, లేదా ఏటీఎం మిషన్ ని మాయం చేసినవాళ్లని చూశాం. కానీ ఈ దొంగలు ఏటీఎంలో డెబిట్ కార్డులు పెట్టి లాఘవంగా క్యాష్ కొట్టేస్తారు. దీనికోసం వీరు ఒకే బ్యాంక్ ని టార్గెట్ చేశారు. ఆ బ్యాంక్ పేరు పోలీసులు బయటపెట్టలేదు. ఆ బ్యాంకు ఏటీఎం లలోని టెక్నికల్ లోపాలను దొంగలు పసిగట్టారని, అందుకే సులభంగా ఆ ఏటీఎంలలో దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. ఏటీఎం మెషిన్లలో ఉన్న టెక్నికల్ లోపాలను క్యాష్ చేసుకుంటున్నారు దొంగలు. విశాఖలో ఆ ఏటీఎం సెంటర్లనుంచి 26 ఏటీఎం కార్డులు ఉపయోగించి 9.49 లక్షలు డ్రా చేశారు. ఈ మేరకు టెక్నికల్ లోపాలు సరిదిద్దుకోవాలంటూ సదరు బ్యాంక్ అధికారులను పోలీసులు హెచ్చరించారు.

ఎలా చేస్తారంటే..?

నవంబర్ 30న ఈ దొంగతనం జరిగింది. ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన దొంగలు కార్డు పెట్టి ట్రాన్సాక్షన్ జరిగే లోపు ఏటీఎం మిషన్ కి పవర్ సప్లై ఇచ్చే స్విచ్ ఆఫ్ చేస్తారు. దీంతో ఆ ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోతుంది, కానీ అప్పటికే ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా అవుతుంది కాబట్టి, తిరిగి స్విచ్ ఆన్ చేయగానే నగదు బయటకు వస్తుంది. టెక్నికల్ గా ట్రాన్సాక్షన్ ఎర్రర్ చూపిస్తుంది, ఖాతాదారుడి అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా కాదు, కానీ బ్యాంక్ లెడ్జర్ లో నుంచి నగదు తగ్గుతుంది. ఇలా ఆ బ్యాంక్ ఏటీఎంలను దోచుకుంటున్నారు దొంగలు. ప్రధాన నిందితుడు షారుఖ్ పరారీలో ఉండగా, ముఠా సభ్యులు నలుగురిని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద గంజాయి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి రెండు రోజుల ముందు ఈ ముఠా విమానంలో విశాఖ వచ్చినట్టు గుర్తించారు.

Tags:    
Advertisement

Similar News