అసెంబ్లీకి రండి, మాట్లాడండి.. నేను అవకాశం ఇస్తా
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జగన్ కి సలహా ఇచ్చారు. అసెంబ్లీకి హాజరు కావడం ఆయన హక్కు అని, ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటున్నారు జగన్. హోదా ఇచ్చే ప్రసక్తే లేదని పరోక్షంగా హింటిచ్చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఐదేళ్లపాటు జగన్ లేని అసెంబ్లీని చూడాల్సిందేనా అనే అనుమానం అందరిలో ఉంది. అయితే జగన్ ని మాత్రం టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీకి ఆహ్వానిస్తూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జగన్ కి సలహా ఇచ్చారు. అసెంబ్లీకి హాజరు కావడం ఆయన హక్కు అని, ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పారు.
అసెంబ్లీలో ప్రతి విధానంపై చర్చ జరగాలన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వ్యవసాయం, నీటి సరఫరా, వెనకపడిన ప్రాంతాల అభివృద్ధి.. వంటి విషయాలపై చర్చ జరగాలని చెప్పారు. అసెంబ్లీకి వస్తే నేతలకు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయంపై అవగాహన వస్తుందని అన్నారు. తాను స్పీకర్ గా అందరికీ సమాన అవకాశాలిస్తానన్నారు అయ్యన్న. జగన్ కి కూడా అవకాశమిస్తామని, అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు.
కండిషన్స్ అప్లై..
సభ కట్టుబాట్లు, పద్ధతులకు కట్టుబడి మాట్లాడితేనే అసెంబ్లీకి మర్యాద అని చెప్పారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వాటిని ఉల్లంఘిస్తే మాత్రం తాను ఊరుకోబోనన్నారు. స్పీకర్ గా తన పరిధి మేరకు అలాంటివి జరక్కుండా చూస్తానన్నారు. సభా గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం ప్రతి సభ్యుడికి ఉందన్నారు అయ్యన్నపాత్రుడు.