పోలీసుల వలలో నిత్య పెళ్లికొడుకు
జల్సాలకు అలవాటుపడిన మనోహర్.. డబ్బు కోసం ఒంటరి మహిళలను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఒంటరి మహిళలనే టార్గెట్ చేశాడు.
మ్యాట్రిమోని ద్వారా ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తాడు.. వారిని నమ్మించి పెళ్లి చేసుకుంటాడు.. ఆ తర్వాత వారి డబ్బు, నగలతో ఉడాయిస్తాడు.. ఇదీ తమిళనాడుకు చెందిన ఓ నిత్య పెళ్లి కొడుకు బాగోతం. తాజాగా అతన్ని వలపన్ని పట్టేసిన పోలీసులు గురువారం విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ఏసీపీ డాక్టర్ బి.రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఘట్టమనేని మనోహర్(మనోహరన్) (47) స్వస్థలం తమిళనాడులో ఉంది. ఇంటర్ వరకు చదివిన అతను చిత్తూరు జిల్లా కావేరి రాజపురంలో నివసిస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి గతంలోనే పెళ్లవగా.. భార్యతో విభేదాల నేపథ్యంలో ఇద్దరూ విడిపోయారు.
జల్సాలకు డబ్బు కోసం...
జల్సాలకు అలవాటుపడిన మనోహర్.. డబ్బు కోసం ఒంటరి మహిళలను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఒంటరి మహిళలనే టార్గెట్ చేశాడు. రాజమండ్రికి చెందిన మహిళను మాయమాటలతో నమ్మించి.. పెళ్లి చేసుకున్నాడు. ఆమె వద్ద డబ్బు, నగలు తీసుకుని ఉడాయించాడు.
విజయవాడలోనూ...
విజయవాడ బందరు రోడ్డులో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇరవయ్యేళ్ల క్రితం భర్తతో విభేదాల నేపథ్యంలో విడిపోయింది. వెబ్‌సైట్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్న మనోహర్.. ఈ ఏడాది మార్చి 4న మంగళగిరిలోని ఓ గుడిలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విజయవాడ బందరు రోడ్డులోని ఆమె సొంతింటిలోనే ఇద్దరూ కాపురం పెట్టారు. మనోహర్ ఆ మహిళ నుంచి దఫదఫాలుగా రూ.5 లక్షల వరకు నగదు తీసుకున్నాడు. ఆమె తమ్ముడి వద్ద మరో రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. మహిళ క్రెడిట్ కార్డులనూ వాడేశాడు.
తల్లిని చూసొస్తానని వెళ్లి...
ఆ తర్వాత కొద్ది రోజులకు.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదంటూ.. చూసి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత తన తల్లి చనిపోయిందని చెప్పాడు. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో ఆమె కావేరి రాజపురానికి వెళ్లి విచారించగా, అతని తల్లి చనిపోలేదని తెలిసింది. అతనికి ముందే పెళ్లి జరిగిందని తెలిసి.. తాను మోసపోయానని గ్రహించి.. కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడ నగర కమిషనర్ టీకే రాణా ఆదేశాల మేరకు 3 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విజయవాడ బస్టాండులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అనేక మోసాల్లోనూ నిందితుడు...
నిందితుడు మనోహర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అతను మరిన్ని మోసాల్లో నిందితుడని గుర్తించారు. విశాఖపట్నంలో పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడని, డబ్బుతో ఉడాయించాడని పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై, తిరుపతిలో అమాయకులను మోసం చేశాడని చెప్పారు. ఈ మేరకు అతనిపై ఆయా స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు.