అలనాటి శాసనానికి ఆదరణ కరువు

నార్నెపాడు భీమేశ్వరాలయం బయట క్రీ.శ.12వ శతాబ్ది శాసనం నిర్లక్ష్యానికి గురవటం పట్ల, పురావస్తుపరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-07-07 10:30 IST

పల్నాడు జిల్లా, ముప్పాళ మండలం, నార్నెపాడు భీమేశ్వరాలయం బయట క్రీ.శ.12వ శతాబ్ది శాసనం నిర్లక్ష్యానికి గురవటం పట్ల, పురావస్తుపరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర అభిమానులు మణిమేల శివశంకర్‌, స్వర్ణ చినరామిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారంనాడు ఆ శాసనాన్ని పరిశీలించారు. ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా, ఈ శాసనాన్ని రోడ్డుపై పడేశారని, కింద పీఠం, పైన శాసన రాయి, దానిపైన నంది, విగ్రహం అలనాటి శాసన విధానాన్ని తెలియ జేస్తుందన్నారు. శాసన రాయిపై క్రీ.శ.1151 నాటివి రెండు, క్రీ.శ.1198 నాటి ఒకటి, క్రీ.శ.12వ శతాబ్ది తేదీలేని రెండు, క్రీ.శ.1266 నాటి ఒకటి, కలిపి మొత్తం ఆరు శాసనాలున్నాయని, వీటిని 1933లో నకళ్లు తీయగా ఇటీవల కేంద్ర పురావస్తు శాఖ, శాసన విభాగ సంచాలకులు, డా. కె. మునిరత్నం రెడ్డి ప్రచురించారని, శివనాగిరెడ్డి చెప్పారు.


శ్రీ నారాయణపాడు అని శాసనంలో పేర్కొన్న నార్నెపాడులో క్రీ.శ.1151 శాసనాల్లో వొరిగొండ పోలనామాత్యుడు, మందాడి కొమ్మినామాత్యుడు, క్రీ.శ.1198 శాసనంలో వల్లూరి నామనాయకుడు స్థానిక సోమేశ్వర (సోమనాథ), కేశవస్వామి అఖండ దీపాలకు గొఱ్ఱెల్ని దానం చేసిన, గ్రామంలోని సోమనాథాలయంలో అదే కాలంలో, మండెపూడి సూరమనాయుడు నందిని ప్రతిష్టించిన వివరాలున్నాయని ఆయన చెప్పారు.


క్రీ.శ.12వ శతాబ్దనాటి వెలనాటి రాజేంద్రుని శాసనంలో, బాపట్ల సమీపంలోని చందోలు నుంచి పాలిస్తున్న రెండో గొంకరాజు, ఆయన భార్య ప్రోలాంబిక, మంత్రి కొమ్మనామాత్యులు, రెమ్మన అనే కమ్మదేశాధిపతి ప్రస్తావనలు వున్నట్లు, ఇంకా అదే గ్రామంలో ద్రోణ (దొర) సముద్రమనే చెరువును తవ్వించిన వివరాలున్నాయని చెప్పారు. కమ్మదేశాన్ని (కమ్మనాడు) ప్రస్తావిస్తున్న చారిత్రక ప్రాధాన్యత గల చారిత్రక ప్రాధాన్యత గల 800 ఏళ్ల నాటి ఈ శాసనాన్ని ఆలయంలోకి తరలించి, మళ్లీ యధావిధిగా నిలబెట్టి కాపాడు కోవాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Similar News